ఐపీఎల్‌ బ్రాండ్ @ రూ.47,500 కోట్లు

ఐపీఎల్‌ బ్రాండ్ @ రూ.47,500 కోట్లు

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) బ్రాండ్‌ విలువ రూ.47,500 కోట్లకు చేరింది.. అమెరికా డాలర్లలో ఐపీఎల్ బ్రాండ్ విలువ 6.8 బిలియన్‌ డాలర్లు. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 7 శాతం పెరిగినట్టు డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ తన నివేదికలో వెల్లడించింది. ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ రూ.6,138.1 కోట్లకు కొనుగోలు చేసిందంటేనే దానికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ లీగ్‌కు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండడం కూడా మరోవిశేషం. ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరగడంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు భాగా సహకరించినట్టు డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ నివేదిక పేర్కొంది.

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ గత కొన్ని సంవత్సరాలుగా మైదానంలో వారు చేసిన కృషి, స్థిరమైన విజయాల ప్రయోజనాలను పొందగా, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల విలువ క్షీణించింది. ఈ రెండు ఫ్రాంచైజీలు గత సీజన్‌ను వరుసగా 5వ, 8వ స్థానంలో నిలిచాయి. లీగ్ మొత్తం బ్రాండ్ విలువ 2018లో రూ .41,800 కోట్లు కాగా.. ఈ ఏడాది 7 శాతం వృద్ధితో రూ. 47,500 కోట్లకు పెరిగింది. ఇక, అగ్రశ్రేణి జట్ల విలువలు చూస్తే, ముకేష్ అంబానీ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ విలువలో 8.5 శాతం పెరుగుదలను నమోదు చేయడంతో ఆ జట్టు విలువ రూ.809 కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విలువ రూ.732 కోట్లుగా ఉంది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఈ జట్టు ఏకంగా 13.1 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ పేర్కొంది. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌గా పిలువపడే జిందాల్స్ సహ యాజమాన్యంలోని ఢిల్లీ జట్టు 8.9 శాతం బ్రాండ్ విలువ పెరిగి ఈ ఏడాది రూ .374 కోట్లకు చేరింది. కోల్‌కతా జట్టు విలువ 8.3 క్షీణించి రూ.629 కోట్లకు పడిపోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 శాతం పడిపోయి రూ.595 కోట్లతో సరిపెట్టుకుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు 4.6 శాతం వృద్ధితో తన బ్రాండ్ విలువను రూ.483 కోట్లుకు పెంచుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4.3 శాతం వృద్ధి సాధించి తన విలువను రూ.358 కోట్లకు పెంచుకోగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం 4.5 శాతం క్షీణించి రూ.271 కోట్లకు తన బ్రాండ్ విలువను దిగదార్చుకుంది.