సొంతగడ్డపై చెన్నైకి షాక్‌

సొంతగడ్డపై చెన్నైకి షాక్‌

చెపాక్‌లో చెన్నైని ముంబై జట్టు మట్టికరిపించింది. సొంతగడ్డపై ఈ సీజన్‌లో తొలిసారి చెన్నైకి పరాభవం ఎదురైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన చెన్నై.. 109 పరుగులకే ఆలౌటైంది.  7.2 ఓవర్లలో 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఊపు మీద కనిపించిన మురళీ విజయ్‌ కూడా బుమ్రా వేసిన 12వ ఓవర్లో పెవిలియన్‌ చేరాడు. శాంట్నర్‌ (22) - బ్రావో (20) భాగస్వామ్యాన్ని నెలకొల్పినా.. జట్టు స్కోరు 99 వద్ద బ్రావోను మలింగ అవుటవడంతో  సూపర్‌కింగ్స్‌ ఓటమి ఖాయమైపోయింది. 

అంతకముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 నష్టానికి 155  చేసింది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ (67 పరుగులు, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లు) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇవన్ లివైస్ (32 పరుగులు, 30 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), డికాక్ (15 పరుగులు,9 బంతుల్లో ఒక ఫోరు), హార్దీక్ పాండ్య (23 పరుగులు, 18 బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్స్) మినహా మిగతా బ్యాట్ మెన్ ఎవరూ క్రీజ్ లో నిలదొక్కుకోలేక పోయారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహార్, ఇమ్రాన్ తాహీర్ చెరో వికెట్ తీసుకోగా, మిచెల్ సాంటర్ రెండు వికెట్లు పడగొట్టాడు.