ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్‌: చెన్నై టార్గెట్‌ ఇదీ..

ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్‌: చెన్నై టార్గెట్‌ ఇదీ..

వైజాగ్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంత్‌ (38: 25  బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పృథ్వీ షా (5: 6 బంతుల్లో 1x4) అవుటయ్యాడు. ఆరో ఓవర్ వేసిన శిఖర్ ధావన్ (18: 14 బంతుల్లో 3x4) పెవిలియన్‌ చేరాడు. 57 పరుగుల వద్ద కొలిన్ మున్రో (27: 24 బంతుల్లో 4x4)ను జడేజా అవుట్‌ చేశాడు. అయ్యర్ (13: 18 బంతుల్లో 1x4), అక్షర్ పటేల్ (3: 6 బంతుల్లో) కూడా వెనువెంటనే అవుటవడంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో రూదర్‌ఫోర్డ్‌ ఓ సిక్స్ కొట్టి ఢిల్లీ జట్టులో ఆశలు రేపాడు. కానీ.. రూదర్‌ఫోర్డ్‌ను హర్భజన్‌ అవుట్‌ చేయడంతో భారం మొత్తం పంత్‌పైన పడింది. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జోరు మీద కనిపించిన పంత్‌..  భారీ షాట్‌కు యత్నించి 19వ ఓవర్లో అవుటయ్యాడు. చివరి ఓవర్లో ఇషాంత్‌ శర్మ ఓ ఫోర్, సిక్సర్‌ కొట్టడంతో స్కోరు 147కి చేరింది. చెన్నై బౌలర్లలో చాహర్‌, హర్భజన్‌, బ్రావో, జడేజా చెరో రెండు వికెట్లు తీయగా.. తాహిర్‌ ఒక వికెట్‌ తీశాడు.