ఐపీఎల్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన చెన్నై

ఐపీఎల్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన చెన్నై

ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. విశాఖ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీ..  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంత్‌ (38: 25  బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పృథ్వీ షా (5: 6 బంతుల్లో 1x4) అవుటయ్యాడు. ఆరో ఓవర్ వేసిన శిఖర్ ధావన్ (18: 14 బంతుల్లో 3x4) పెవిలియన్‌ చేరాడు. 57 పరుగుల వద్ద కొలిన్ మున్రో (27: 24 బంతుల్లో 4x4)ను జడేజా అవుట్‌ చేశాడు. అయ్యర్ (13: 18 బంతుల్లో 1x4), అక్షర్ పటేల్ (3: 6 బంతుల్లో) కూడా వెనువెంటనే అవుటవడంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో రూదర్‌ఫోర్డ్‌ ఓ సిక్స్ కొట్టి ఢిల్లీ జట్టులో ఆశలు రేపాడు. కానీ.. రూదర్‌ఫోర్డ్‌ను హర్భజన్‌ అవుట్‌ చేయడంతో భారం మొత్తం పంత్‌పైన పడింది. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జోరు మీద కనిపించిన పంత్‌..  భారీ షాట్‌కు యత్నించి 19వ ఓవర్లో అవుటయ్యాడు. చివరి ఓవర్లో ఇషాంత్‌ శర్మ ఓ ఫోర్, సిక్సర్‌ కొట్టడంతో స్కోరు 147కి చేరింది. చెన్నై బౌలర్లలో చాహర్‌, హర్భజన్‌, బ్రావో, జడేజా చెరో రెండు వికెట్లు తీయగా.. తాహిర్‌ ఒక వికెట్‌ తీశాడు.

148 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. తొలి ఓవర్లో ఢిల్లీకి వికెట్‌ దక్కాల్సినా.. పేలవ ఫీల్డింగ్‌తో రనౌట్‌ను మిస్‌ చేశారు. రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన డుప్లెసిసి.. మూడో ఓవర్‌ నుంచి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. వాట్సన్‌ కూడా బ్యాట్‌ ఝళిపించడంతో  చెన్నై 10 ఓవర్లలో 81/0తో నిలిచింది. ఈక్రమంలో డుప్లెసిస్‌ అవుటైనప్పటికీ.. వాట్సన్‌ విధ్వంసకర షాట్లతో చుక్కలు చూపించాడు. మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 12వ ఓవర్లో  25 పరుగులు రాబట్టాడు. వాట్సన్‌, రైనా, ధోనీ వెనువెంటనే అవుటైనా..  అంబటి రాయుడు (20 నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశాడు.