సన్‌సైజర్స్‌ సూపర్‌ విక్టరీ.. 15 ఓవర్లలోనే..

సన్‌సైజర్స్‌ సూపర్‌ విక్టరీ.. 15 ఓవర్లలోనే..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి అదరగొట్టింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(67, 38 బంతుల్లో 3x4, 5x6, బెయిర్‌స్టో (80 నాటౌట్‌, 43 బంతుల్లో 7x4, 4x6) ధాటిగా ఆడడంతో 160 పరుగుల లక్ష్యాన్ని 15 ఒవర్లలోనే ఛేదించింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ లిన్‌ 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  ఓపెనర్‌ నరైన్‌ 8 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 25 పరుగులు చేసి అవుటయ్యాక స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. నరైన్‌ అవుటైన కాసేపటికే శుభ్‌మన్‌ గిల్ (3), నితీశ్ రాణా (11) పెవిలియన్‌ చేరారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6) రనౌటవడంతో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ సింగ్‌ భారీ షాట్లు కొట్టాడు. 25 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రింకూ.. సిందీప్‌ శర్మ బౌలింగ్‌లో అవుటాయ్యాడు. ఈ దశలో లిన్‌కు జతకలిసిన ఆండ్రూ రసెల్‌(15).. వరుసగా రెండు సిక్సర్లు కొట్టినా చివరి బంతికి బౌండరీ దగ్గర ఫీల్డర్‌కు చిక్కాడు. చివరి ఓవర్లో కరియప్ప ఓ సిక్స్‌ కోట్టడంతో కేకేఆర్‌ 159 పరుగులు చేయగలిగింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3.. భువనేశ్వర్‌ 2.. రషీద్‌ఖాన్‌, సందీప్‌శర్మ చెరో వికెట్‌ తీశారు.

160 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో చెలరేగి ఆడారు. బౌండరీలు, సిక్సర్లతో బౌలర్లకు చుక్కులు చూపించారు. వికెట్‌ కోల్పోకుండానే విజయం ఖాయం అనుకున్న తరుణంలో తెలుగు తేజం యర్రా పృథ్వీరాజ్‌ వేసిన 13వ ఓవర్‌లో డేవిడ్‌ వార్నర్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మరో వికెట్‌ పడకుండానే బెయిర్‌స్టో.. జట్టుకు విజయాన్ని అందించాడు.