చెలరేగిన కార్తీక్‌..

చెలరేగిన కార్తీక్‌..

ఈడెన్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్‌ కార్తీక్‌ (50 బంతుల్లో 97 పరుగులు, 7 ఫోర్లు, 9 సిక్సర్లు) కళ్లు చెదిరే ఇన్నింగ్‌ ఆడాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టులో ఓపెనర్లు క్రిస్‌లిన్‌ (0), శుభ్‌మన్‌ గిల్‌ (14)ను పేసర్‌ వరుణ్ ఆరోన్‌ బౌల్డ్‌ చేశాడు. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 8.2వ బంతికి నితీశ్‌ రాణా (21) ఔటయ్యాడు. ఈదశలో కార్తీక్‌-నరైన్‌ జోడీ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నరైన్‌ 11 పరుగులకు అవుటయ్యాక బరిలోకి దిగిన విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ రసెల్ ఒక సిక్స్‌ కోట్టి ఊపు మీద కనిపించినా 14 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్రాత్‌వైట్‌ కూడా 5 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కార్తీక్‌ చెక్కుచెదరకుండా బౌలర్లను చితక్కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సెంచరీ ఖాయమనుకన్న తరుణంలో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.