కోల్‌కతాకు టీనేజర్‌ షాక్‌

కోల్‌కతాకు టీనేజర్‌ షాక్‌

ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్ జట్టు 19.2 ఓవర్లలోనే 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించి విజయం సాధించింది. ఓటమి ఖాయమనుకున్న తరుణంలో టీనేజర్‌ పరాగ్‌ (47; 31 బంతుల్లో 5 x 4, 2 x 6) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్‌  (27 నాటౌట్‌; 12 బంతుల్లో 2 x 4, 2 x 6) మెరవడంతో ఆ జట్టును విజయం వరించింది. రహానే 34, శాంసన్ 22, స్మిత్ 2, స్టోక్స్ 11, బిన్నీ 11, గోపాల్ 18 27 పరుగులు చేశారు.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్‌ కార్తీక్‌ (50 బంతుల్లో 97 పరుగులు, 7 ఫోర్లు, 9 సిక్సర్లు) కళ్లు చెదిరే ఇన్నింగ్‌ ఆడాడు. ఓపెనర్లు క్రిస్‌లిన్‌ (0), శుభ్‌మన్‌ గిల్‌ (14)ను పేసర్‌ వరుణ్ ఆరోన్‌ బౌల్డ్‌ చేశాడు. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 8.2వ బంతికి నితీశ్‌ రాణా (21) ఔటయ్యాడు. ఈదశలో కార్తీక్‌-నరైన్‌ జోడీ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నరైన్‌ 11 పరుగులకు అవుటయ్యాక బరిలోకి దిగిన విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ రసెల్ ఒక సిక్స్‌ కోట్టి ఊపు మీద కనిపించినా 14 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్రాత్‌వైట్‌ కూడా 5 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కార్తీక్‌ చెక్కుచెదరకుండా బౌలర్లను చితక్కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సెంచరీ ఖాయమనుకన్న తరుణంలో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.