ముంబై చేతిలో చెన్నై చిత్తు..

ముంబై చేతిలో చెన్నై చిత్తు..

ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌-12 ఫైనల్‌కు దూసుకెళ్లింది. చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసి నేరుగా తుది పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-1లో చెన్నైపై ముంబై 6 వికెట్ల తేడాతో గెలిచింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. అంబటిరాయుడు ‌(42; 37 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్), ధోనీ(37; 29 బంతుల్లో 3ఫోర్లు) మాత్రమే రాణించారు. వీరిద్దరూ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై ఆ మాత్రం స్కోర్‌ చేయగలిగింది. తొలుత 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని మురళీవిజయ్‌(26; 26 బంతుల్లో 3ఫోర్లు), అంబటి రాయుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా కృనాల్‌ పాండ్య, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.

132 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై.. 4 ఓవర్లలో 22 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. కానీ సూర్యకుమార్‌ యాదవ్‌ వెన్నెముకలా నిలిచాడు. 14వ ఓవర్లో స్కోరు వంద దాటిన వెంటనే తాహిర్‌ వరుస బంతుల్లో కిషన్‌, కృనాల్‌లను ఔట్‌ చేశాడు. కానీ హార్దిక్‌ పాండ్య (13 నాటౌట్‌)తో కలిసి సూర్యకుమార్‌ ముంబైని గెలిపించాడు.