పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్‌

పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎట్టకేలకు గెలిచింది.. ఈ ఐపీఎల్‌లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఈ జట్టు ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. కోల్‌కతా నిర్ధేశించిన 233 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ముంబై.. 7 వికెట్లకు 198 పరుగులు మాత్రమే చేసింది. 

టాస్‌ ఓడి తొలి బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా.. సొంత మైదానంలో దుమ్మురేపింది. ఓపెనర్లు అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి ఓపెనర్లు క్రిస్ లిన్, శుభ్‌మాన్ గిల్ కలిసి 96 పరుగులు చేశారు. హాఫ్ సెంచరీ చేసిన క్రిస్ లిన్(54, ) రాహుల్ చాహర్ బౌలింగ్ లో లివీస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శుభ్ మాన్ గిల్ (76,45 బంతుల్లో 6 సిక్సులు, 4 ఫోర్లు) చక్కటి ఆటతో ఆకట్టుకున్నాడు. హార్ధిక్‌ పాండ్యా వేసిన 16వ ఓవర్ 2వ బంతికి గిల్ ఔట్ అయ్యాడు. అప్పుడు వచ్చిన ఆల్ రౌండర్ రస్సెల్(80, 40బంతుల్లో, 6 ఫోర్లు, 8 సిక్స్ లు) రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్, హార్థిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.

ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ముంబై 6.1 ఓవర్లలో 41 పరుగులకే మూడు వికెట్లు. డికాక్‌ (0), రోహిత్‌ (12), లూయిస్‌ (15) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సూర్యకుమార్‌ కాసేపు ప్రతిఘటించినా.. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ముంబైకి ఘోర ఓటమి తప్పదనుకున్న తరుణంలో హార్దిక్‌ పాండ్య అనూహ్యంగా విరుచుకుపడ్డాడు. కోల్‌కతా బౌలర్లను చీల్చిచెండాడు. కళ్లు చెదిరే సిక్సర్లతో వీరవిహారం చేస్తూ.. టార్గెట్‌కు గురిపెట్టాడు. చివరి 6 ఓవర్లలో విజయానికి 100 పరుగులు చేయాల్సిన స్థితిలో మరింత రెచ్చిపోయాడు.  చివరి 4 ఓవర్లలో 73 పరుగులు కావాల్సిన దశలో 17వ ఓవర్‌లో హార్ధిక్‌ ఓ ఫోర్‌, సిక్స్‌తో చెలరేగాడు. 18వ ఓవర్‌లోఆరో బంతికి అతను అవుటవడంతో ముంబై ఓటమి లాంఛనమే అయ్యింది. రసెల్‌ (2/25) బంతితోనూ రాణించాడు.