ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్‌ ఔట్‌ 

ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్‌ ఔట్‌ 

ఐపీఎల్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నిష్క్రమించింది. ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖలో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక దశలో హైదరాబాద్‌దే గెలుపు అనేలా కనిపించినా రిషభ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఢిల్లీకి విజయాన్ని అందించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్‌ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. స్కోర్ 31 పరుగుల వద్ద సాహా(8) ఇషాంత్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం మార్టీన్ గుప్తిల్(36; 19 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్స్), మనీష్‌ పాండే(30; 36 బంతుల్లో, 3 ఫోర్లు) ధీటుగా బ్యాటింగ్ చేశారు. పాండే 30 పరుగులు చేసిన అనంతరం కీమో పాల్ బౌలింగ్ లో రూథర్ పోర్డు కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్ సన్ (28; 27 బంతుల్లో, 2 ఫోర్లు) తక్కువ స్కోర్ కే పెవీలియన్ చేరాడు. విజయ్ శంకర్ (25; 11 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించి బౌల్ట్ చేతిలో ఔట్ అయ్యాడు. చివర్లో మహ్మద్ నబీ (20; 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్) ధీటుగా బ్యాటింగ్ చేశాడు. దీపక్ హుడా(4), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్ (0), థంపీ(1 నాటౌట్) తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలింగ్ లో కీమో పాల్ 3, ఇషాంత్ శర్మ2, బౌల్ట్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. 

163 పరుగులతో ఛేజింగ్‌ ప్రారంభించిన ఢిల్లీకి ఓపెనర్లు ధవన్‌, పృథ్వీ షా అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి ఓవర్లోనే ధావన్‌ రెండు ఫోర్లు కొట్టగా.. ఖలీల్‌ వేసిన మూడో ఓవర్లో పృథ్వీ షా మూడు ఫోర్లు బాదాడు.  భువనేశ్వర్‌ వేసిన ఓవర్లో 4, 6, 4తో 16 పరుగులు చేశాడు. హుడా వేసిన 8వ ఓవర్లో సాహా అద్భుత స్టంపింగ్‌కు ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. పృథ్వీ షా అవుటయ్యాక వచ్చిన పంత్‌.. మొదటి నుంచి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రషీద్‌ బౌలింగ్‌లో మన్రో, అక్షర్‌ పటేల్‌ అవుటవడంతో చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో థంపి వేసిన 18వ ఓవర్లో వరుసగా పంత్‌ 4, 6, 4, 6 కొట్టి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు అవసరమవగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ పని పూర్తి చేశారు.