బ్లాక్ లో యదేచ్ఛగా ఐపీఎల్ టికెట్లు

బ్లాక్ లో యదేచ్ఛగా ఐపీఎల్ టికెట్లు

మరికాసేపట్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఐపీఎల్-12 సీజన్ ఫైనల్ జరగనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని నగరవాసులు ఉప్పల్ చేరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే సామాన్యునికి అందుబాటులో ఉండగా అవి కూడా వారికి లభించలేదు. సాధారణ ప్రేక్షకులకు కేటాయించిన అతి కొద్ది టిక్కెట్లు కూడా బ్లాక్ కు తరలిపోయాయని తెలుస్తుంది. కొందరు కేటుగాళ్లు ఉప్పల్ స్టేడియం వద్ద నంబర్‌ ప్లేట్‌లు లేని బైక్‌లపై చక్కర్లు కొడుతు జోరుగా బ్లాక్‌ టికెట్లను విక్రయిస్తున్నారు. వెయ్యి రూపాయల టికెట్‌ను ఐదు వేలకు, రెండు వేల టికెట్‌ను పదివేలకు అమ్ముతున్నారు. టికెట్లు బ్లాక్‌లో దర్శనమివ్వడంతో మ్యాచ్‌ నిర్వాహకుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో లభించాల్సిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లడంపై నగరంలోని కిక్రెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.