మా మేఘాలు దొంగలిస్తున్నారు బాబోయ్‌!

మా మేఘాలు దొంగలిస్తున్నారు బాబోయ్‌!

గల్ఫ్ దేశం ఇరాన్ తమ పొరుగున ఉన్న ఇజ్రాయిల్ పై ఓ విచిత్రమైన ఆరోపణ చేసింది. అది విన్న వారెవరైనా అవాక్కవ్వాల్సిందే. తమ దేశంపై కమ్ముకున్న మేఘాలను ఇజ్రాయిల్ దొంగిలిస్తోందనేది ఇరాన్ ఆరోపణ. అలాగే తమవైపు వస్తున్న, రావాల్సిన మేఘాలను మధ్యలోనే దారి మళ్లిస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి చర్యలతో తమ దేశ వాతావరణ పరిస్థితులను మార్చి తమను ఇక్కట్ల పాల్జేసేందుకు ఇజ్రాయిల్ కుట్ర చేస్తున్నట్టు అనుమానంగా ఉందని ఇరాన్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ హెడ్ జనరల్ ఘులామ్ రెజా జలాలీ ఆరోపించారు. 

దేశంలో వర్షాలు కురవకపోవడానికి, మంచు కనిపించక పోవడానికి కారణాలను అధ్యయనం చేసిన ఇరానియన్ సైంటిఫిక్ విభాగం.. దీని వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉన్నట్టు ధ్రువీకరించిందని ఘులామ్ ఆరోపించారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలోని మరో దేశంపైనా ఇజ్రాయిల్ ఇదే తరహాలో వాతావరణ యుద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి మధ్యధరా సముద్ర ప్రాంతం వరకూ 2,200 మీటర్ల ఎత్తున మంచు పేరుకుపోయి ఉందని, ఇరాన్ పై మాత్రం అది లేదని ఆయన తెలిపారు. 

కొంతకాలంగా ఇరాన్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుగుపొరుగు దేశాల్లో వర్షాలు పడుతున్నా, ఇరాన్ పై మాత్రం వరుణుడు కరుణ చూపడం లేదు.