చావుబతుకుల ఆట వన్ వే మాత్రమే

చావుబతుకుల ఆట వన్ వే మాత్రమే

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొన్ని నెలలుగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన కేన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో చికిత్స పొందుతున్న ఇర్ఫాన్.. తన వ్యాధి పరిస్థితి, కోలుకొనేందుకు తన ప్రయత్నాలపై భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. 

లేఖలో ఇర్ఫాన్ ఖాన్ భావోద్వేగం

న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్ నా డిక్షనరీలో ఓ కొత్త పదం అయిపోయింది. ఇది చాలా అరుదైన వ్యాధి అని తెలిసింది. అందుకే ఈ వ్యాధి గురించి పుస్తకాల్లో తక్కువ సమాచారం ఉంది. ఈ వ్యాధి సోకడంతో నా జీవితం ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ గేమ్ లా మారిపోయింది. నా జీవితం ఒక రైలైతే అందులో ఎన్నో కలలు, ప్రణాళికలు, లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకొనే ప్రయత్నంలో ఉండగా టీసీ వచ్చి 'నీ గమ్యం ఇదే. దిగి పో' అన్నట్టుగా ఉంది. ఎంత ఓర్చుకొంటున్నా నా కలలు చిదిమేసిన బాధ ఇంకా సలుపుతూనే ఉంది.

ఇప్పుడు ఓదార్పు మాటలు నాపై ప్రభావం చూపడంలేదు. ఆస్పత్రిలోకి నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఎంతో కుమిలిపోయాను. లార్డ్స్‌ స్టేడియం సమీపంలోని ఆస్పత్రిలో ఉన్నానని గుర్తించలేదు. నొప్పితో బాధపడుతూనే సర్ వివియన్‌ రిచర్డ్స్‌ నవ్వుతున్న పోస్టర్‌ చూశాను. కానీ నిర్వికారంగా, స్తబ్దంగా ఉండిపోయాను. చావుబతుకుల ఆట వన్ వే మాత్రమే. ఆ రోడ్డులో ఒక వైపు ఆస్పత్రి, మరో వైపు లార్డ్స్‌ స్టేడియం ఉన్నాయి. నా ట్రీట్ మెంట్ పూర్తవడానికి నెలలే కావచ్చు.. ఏడాది కూడా పట్టొచ్చు. కానీ నేను నా పోరాటం అపను. మొట్టమొదటిసారి స్వేచ్ఛ గురించి తెలుసుకున్నాక జీవితం రుచి తెలుస్తోంది. అభిమానులంతా నేను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. నాకు తెలీని వారు కూడా నేను నయం కావాలని ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు నాలో ఉత్తేజం, సంతోషాన్ని నింపాయి.