బంగారంలో ఇపుడు పెట్టుబడి కరక్టేనా?

బంగారంలో ఇపుడు పెట్టుబడి కరక్టేనా?

కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అమెరికా మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,250 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. బంగారం బలహీన పడటానికి ప్రధాన కారణం ఇతర కరెన్సీలతో  బలపడటమే. మూడేళ్ళ నుంచి ఎదురుచూస్తున్న బులియన్‌ ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న... ఈ ధోరణి ఇంకెంత కాలం? వాణిజ్యయుద్ధాలు మొదలయ్యాయని... మరో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ఇవి సంకేతాలని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్న ఈ సమయంలో బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చా? స్టాక్‌ మార్కెట్‌కే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిందని.. మున్ముందు ఇదే జోరు కష్టమని... తొందర్లనే భారీ కరెక్షన్‌ వస్తుందని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో... ఇపుడైనా బంగారంలో పెట్టుబడి  పెడదామా అని ఆలోచిస్తున్న ఇన్వెస్టర్లూ ఉన్నారు.

విశ్లేషకుల మాట...
బంగారంలో సుదీర్ఘ బుల్‌ రన్‌ తరవాత నడుస్తున్న ఈ బేర్‌ ఫేజ్‌ ఇంకా పూర్తి కాలేదని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఈ స్తబ్దత  మరికొంత కాలం కొనసాగడం ఖాయమని చెబుతున్నారు కమోడిటీ మార్కెట్ నిపుణులు. పెట్టుబడి పెట్టే ముందు అత్యంత జాగ్రత్త అవసరమని  సూచిస్తున్నారు. బంగారం ధరలను నేరుగా ప్రభావితం చేస్తున్న అమెరికా డాలర్ భవిష్యత్తుపై ఇంకా క్లారిటీ లేదు. యూరో అంతర్గత గొడవలు, చైనా ఆర్థిక వృద్ధి స్పీడు తగ్గడం నేపథ్యంలో డాలర్‌ ఎపుడు కరెక్షన్‌ వస్తుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అవలంబిస్తున్న రక్షణాత్మక విధానాల కారణంగా దేశీయంగా డాలర్‌కు బలం వస్తోంది.  బంగారాన్ని ప్రభావితం చేసే మరో  కీలక అంశం అమెరికా ట్రెజరీలపై ప్రతిఫలం (ఈల్డ్). ఇటీవల అమెరికాలో వరుసగా వడ్డీ రేట్లు పెంచడం, మున్ముందు మరింత పెంచడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఈ బాండ్లపై  ప్రతిఫలం మరింత  పెరిగే పక్షంలో... స్వల్పకాలిక ఇన్వెస్టర్లు బంగారానికి బదులు బాండ్లు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ కారణంగా  బంగారం ధరలు ఇక్కడి నుంచి  మరింత పెరగడం కష్టమే. ఇందాకే పేర్కొన్నట్లు ఈ ఏడాది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరో రెండు లేదా మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. దీనివల్ల కూడా ఇన్వెస్టర్లు బాండ్లకే ప్రాధాన్యం ఇస్తారు.

వడ్డీ రేట్లు
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల విషయంలో మెత్తబడే వరకు  బంగారం కొనే విషయంలో సంయమనం పాటించడం ముఖ్యం.  అమెరికా వడ్డీ రేట్లు పెంచే సూచనలు బలంగా ఉన్నందున బంగారం ధరలు పెరిగే అవకాశాలు అంతంత మాత్రమే. మరికొంత కాలం బంగారం ధరలు ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా  ధరలు మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   ఏవిధంగా చూసినా ఇప్పట్లో బంగారం కొనడానికి దూరంగా ఉండటమే నయం. స్టాక్‌ మార్కెట్ల పతనం మొదలై... భారీ కరెక్షన్‌ మొదలైనపుడు మరోసారి బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి ఆలోచించవచ్చు. అప్పటి వరకు దూరంగా ఉండటమే నయం.