జానారెడ్డి ఇంట్లో బీజేపీ కండువా?

జానారెడ్డి ఇంట్లో బీజేపీ కండువా?

అందరికి ఆయన పెద్దాయన. రాజకీయం ఇన్నాళ్లు ఆయన్ని వదిలేసింది. కానీ.. పెద్దాయన పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆయనదో లెక్క అయితే.. తనయుడిది మరో లెక్క. కీలక సమయంలో ఇప్పుడా ఇంట్లో రాజకీయం ఎలా ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా పెద్దాయన? 

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక.. జానారెడ్డిపై చర్చ!

దుబ్బాక అయిపోయింది. GHMC పోరు పూర్తయింది. తెలంగాణలో మళ్లీ ఉపఎన్నికపై చర్చ మొదలైంది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణమే ఈ చర్చకు కారణం. నర్సింహయ్య టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. అధికార పార్టీ ఇంకా ఉప ఎన్నిక దిశగా ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. కానీ.. ఇతర పార్టీలు మాత్రం లెక్కలు.. సమీకరణాలపై  మెల్ల మెల్లగా ఫోకస్‌ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే  కాంగ్రెస్‌ నాయకుడు జానారెడ్డి పేరు చర్చల్లోకి వస్తోంది. 

జానారెడ్డి కుమారుడు రఘువీర్‌పై ఓ రేంజ్‌లో చర్చ!

మాజీ మంత్రి జానారెడ్డి సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్‌. నోముల అకాల మరణంతో  జరగబోయే ఉపఎన్నికలో ఆయన పోటీలో ఉంటారా? లేదంటే కుమారుడిని బరిలో నిలుపుతారా? తనయుడు బరిలో ఉంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? అన్న చర్చ మొదలైంది. జానారెడ్డి ఇప్పటి వరకు నోరు మెదపలేదు కానీ.. ఆయన కుమారుడి రఘువీర్‌పై మాత్రం ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. 

జానారెడ్డి కుటుంబంపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఫోకస్‌?

రఘువీర్‌తో బీజేపీ నాయకులు టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.  ఒకవేళ రఘవీర్‌  కాషాయ కండువా కప్పుకొంటే .. బీజేపీ నుంచి ఆయన్నే బరిలో నిలుపుతారని ప్రచారం ఊపందుకుంది. అయితే ఇదే సమయంలో మరో చర్చ కూడా మొదలైంది. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ సైతం జానారెడ్డి కుటుంబం మీద కన్నేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. రఘువీర్‌తో టీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు మాటలు కలిపారని సామాజిక మాధ్యమాల్లో  పోస్టులు షికారు చేస్తున్నాయి. 

జానారెడ్డినే బరిలో దించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌?

అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్‌ ఒక్కసారిగా జానారెడ్డి కుటుంబంపై  కన్నేయడంతో రాజకీయంగా  ఏం జరగబోతుందా అన్న ఆసక్తి పెరుగుతోంది. రఘువీర్‌ తీసుకునే నిర్ణయం.. జానారెడ్డి ఒప్పుకుంటారా లేదా అన్న దానిపై ఎవరు విశ్లేషణలు వారు చేస్తున్నారు.  కాంగ్రెస్‌ మాత్రం మరోలా ఆలోచిస్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వచ్చే ఉప ఎన్నికలో జానారెడ్డిని బరిలో నిలిపి...ఇప్పటి వరకు ఉన్న ఫెయిల్యూర్‌ అంశాన్ని చెరిపేసుకోవాలనే ఆలోచన చేస్తోందట. పైగా ఇలాంటి సమయంలో జానారెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోందట. 

రఘువీర్‌కు బీజేపీ టికెట్‌ ఇస్తే జానారెడ్డి ఏం చేస్తారు?

మొత్తానికి పెద్దాయన మనసులో మాట బయటకు రాకుండానే  జానారెడ్డి  కుటుంబాన్ని రాజకీయ పార్టీలు అష్టదిగ్బంధం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన జానారెడ్డి హస్తంపార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ బీజేపీ జానారెడ్డి కుమారుడు రఘువీర్‌కు వలేసి టికెట్‌ ఇస్తే.. ఏం జరుగుతుందా అన్న చర్చ మొదలైంది. అలాంటి పరిణామం  జానారెడ్డి ఇంట్లో సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. 

జానారెడ్డి లెక్కేంటి? రఘువీర్‌ ఆలోచనేంటి?

వరస ఓటములతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు  ఆపార్టీలో ఇమడ లేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలలో ఎక్కడ అవకాశం ఉంటే అటు వెళ్లిపోతున్నారు. మరి.. జానారెడ్డి కూడా ఆ జాబితాలో చేరిపోతారా? ఊహకు కూడా అందని అలాంటి ఆలోచన కార్యరూపం దాల్చుతుందా? ఇంతకీ జానారెడ్డి లెక్కేంటి? ఆయన కుమారుడు రఘువీర్‌ ఆలోచనేంటి? అన్నది అంతుచిక్కడం లేదట. ప్రస్తుతం రాజకీయ ఆఫర్లు పెద్దాయన తలుపు తడుతున్నాయి. జానారెడ్డి కుటుంబానికి  సంబంధం లేకుండానే చర్చ మొదలైపోయింది. మరి.. నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.