శ్రీలంక బాంబు పేలుళ్లు: తమదే బాధ్యతని ప్రకటించిన ఐఎస్ఐఎస్

శ్రీలంక బాంబు పేలుళ్లు: తమదే బాధ్యతని ప్రకటించిన ఐఎస్ఐఎస్

గత ఆదివారం శ్రీలంకలోని చర్చిలు, లగ్జరీ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లకు తమదే బాధ్యతని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. తన అమాక్ సమాచార సంస్థ ద్వారా ఐఎస్ శ్రీలంకలో పేలుళ్లు జరిపింది తామేనని తెలిపింది. మరోవైపు పేలుళ్లలో మరణించినవారి సంఖ్య పెరిగి 321కి చేరుకుంది. మృతుల్లో 38 మంది విదేశీయులు కూడా ఉన్నారు. శ్రీలంకలో జరిగిన దారుణ మారణ కాండలో 10 మంది భారతీయులు మృత్యువాత పడ్డారు.

శ్రీలంకలో నాలుగో హోటల్ పై కూడా దాడి చేయాలనే ప్రణాళికను భద్రతా సిబ్బంది వమ్ము చేసినట్టు వార్తలు వచ్చాయి. ఒక ఉగ్రవాది దాడికి ఒక రోజు ముందు హోటల్ లో చెకిన్ అయి తన అడ్రస్ కూడా ఇచ్చాడు. అతను ఆదివారం సంఘటనా స్థలంలో ఉన్నాడు. కానీ అతడి దగ్గర పేలుడు పదార్థాలు పేలలేదు. అయితే అతని దగ్గర విస్ఫోటక సామాగ్రి పేలలేదా లేదా అతనే పేల్చరాదని నిర్ణయించుకున్నాడా? అనేది స్పష్టం కాలేదు.

ఇద్దరు ముస్లిం సోదరులు ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నట్టు తెలిసింది. కొలంబోలోని ఒక సంపన్న మసాలా వ్యాపారి కుమారులిద్దరూ ఆత్మాహుతి దాడిలో తమను తాము పేల్చేసుకున్నారు. వీళ్లిద్దరూ రాజధానిలోని షాంగ్రీ-లా, సినమోన్ గ్రాండ్ హోటళ్లలో అల్పాహారం స్వీకరించేందుకు లైన్లలో నిలబడ్డారు.

ఈస్టర్ నాడు ఆదివారం దేశంలోని చర్చిలు, లగ్జరీ హోటళ్లలో జరిగిన పేలుళ్లకు స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాదులు కారణమని శ్రీలంక సీనియర్ మంత్రి ఒకరు పార్లమెంట్ కు వివరించారు. న్యూజిలాండ్ లోని మసీదుల్లో జరిగిన తుపాకీ కాల్పులకు ప్రతీకారంగా పేలుళ్లు జరిపినట్టు ఆయన తెలిపారు. మార్చి 15న న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చిలో రెండు మసీదులపై జరిగిన దాడిలో 50 మంది మరణించారు.

ఇవే కాకుండా ఒక లారీ, వ్యాన్లలో విస్ఫోటక సామాగ్రి తరలిస్తున్నట్టు వార్తలు వచ్చిన తర్వాత శ్రీలంక, కొలంబోలోని అన్ని పోలీస్ స్టేషన్లను హై అలర్ట్ ప్రకటించారు.