పేలుళ్లు ఐసిస్ పనే..

పేలుళ్లు ఐసిస్ పనే..

శ్రీలంక వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయింది.. ఇప్పటి వరకు పేలుళ్లలో 310 మంది మృతిచెందగా... వీరిలో ఎనిమిది మంది భారతీయులు కూడా ఉన్నారు. అయితే, ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్టు విస్పష్టమైన ఆధారాలు లభించాయి. తాజాగా, ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలను ఐసిస్ సానుభూతి టెలిగ్రామ్ ఛానెల్స్ ప్రసారం చేశాయి. ఐసిస్ జెండా పట్టుకున్న ఈ ముగ్గురు ఆత్మాహుతి సభ్యులను అబుల్ బర్రా, అబ్దుల్ ముఖ్తార్, అబు ఉబైదా‌గా గుర్తించారు. వీరి గురించి అమాఖ్ లాంటి ఐఎస్ మీడియా అధికారిక ప్రకటన కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు వేచి చూస్తున్నాయి. అంతేకాదు, వీరిలో ఒకరిని నేషనల్ తావీద్ జమాత్‌కు చెందిన మానవ బాంబు జహర్ హషిన్‌ (అబు ఉబైద్)గా గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉబైద్ మాత్రమే ముఖానికి మాస్క్ లేకుండా ఇందులో ఉండటంతో మిగతా ఇద్దర్నీ గుర్తించే పనిలో ఉన్నారు. అబూబాకర్ అల్ బాగ్దాద్‌కి విధేయుడిగా ప్రతిజ్ఞ చేసిన ఈ ఇద్దర్నీ గుర్తించడం కొంచెం కష్టంగా ఉంది. మరోవైపు ఎన్టీజే ఉగ్రవాద సంస్థకు ఐసిస్ శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది... వరుస పేలుళ్లలో కొంచెం తేరుకుంటున్న సమయంలో సోమవారం మళ్లీ బాంబు పేలుళ్లు సంభవించడంతో శ్రీలంక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు.. ఎక్కడ బాంబులు పేలుతాయేనని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇక ఈ పేలుళ్లతో సంబంధం ఉందని భావిస్తూ ఇప్పటి వరకు 30 మందికిపైగా అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ బాంబు పేలుళ్లలో ఐఎస్ హస్తాన్ని నిర్ధరించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. న్యూజిలాండ్ మసీదులో జరిగిన బాంబు దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఐఎస్ అధికార ప్రతినిధి అబు హసన్ అల్ ముజాహిర్ ఇటీవల ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు. దీంతో ఆ ప్రకటనకు, ఈ పేలుళ్లకు సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.