బాగ్దాదీ ఆపరేషన్‌లో ఇతనే కీలకం.. రూ.177 కోట్ల రికార్డు ఆయనకే..!

బాగ్దాదీ ఆపరేషన్‌లో ఇతనే కీలకం.. రూ.177 కోట్ల రికార్డు ఆయనకే..!

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీని అమెరికా సైనిక కమాండోలు అంతం చేయడంలో ఓ ఇన్ఫార్మర్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బాగ్దాదీ తలపై అమెరికా 2.5 కోట్ల డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు 177 కోట్ల పైనే రివార్డు ప్రకటించింది. ఈ సొమ్ము ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన సదరు వ్యక్తికే దక్కనున్నట్లు తాజాగా అమెరికా మీడియా పేర్కొంది. అల్‌ బాగ్దాదీ ఉన్న స్థావరానికి అమెరికా బలగాలను తీసుకెళ్లేందుకు సిరియా.. ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ వ్యక్తిని ఇన్ఫార్మర్‌గా పెట్టుకుంది. ఆ ఇన్ఫార్మర్‌ చాలా కాలం నుంచి సిరియాలోని ఇద్లిబ్‌లో ఉన్న బాగ్దాదీ స్థావరంలోనే ఉన్నాడు. బాగ్దాదీ స్థావరం గురించి ఆ వ్యక్తి పూర్తి సమాచారం ఇచ్చినట్లు సిరియన్‌ డెమోక్రటిక్ ఫోర్సెస్‌ జనరల్‌ మజ్లూమ్‌ అబ్ది తెలిపారు. 

బాగ్దాదీ దాక్కొన్న కచ్చితమైన ప్రదేశం, ఆ ఇంటి లేఅవుట్‌, అక్షాంశ, రేఖాంశ వివరాలతో పాటు ఎన్ని గదులున్నాయి? ఎంతమంది కాపలా కాస్తున్నారు? సొరంగం మార్గం వంటి వివరాలను ఇన్ఫార్మర్‌ ఇచ్చాడని పేర్కొన్నారు. ఆపరేషన్‌కు చాలా రోజుల ముందు ఆ వ్యక్తి.. బాగ్దాదీ ఉపయోగించిన లోదుస్తులు, రక్తనమూనాలను అమెరికా నిఘా అధికారులకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నమూనాల ఆధారంగానే డీఎన్‌ఏ పరీక్షను నిర్వహించి బాగ్దాదీ మరణాన్ని అమెరికా నిర్ధారించింది.