మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని థ్యాంక్స్

మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని థ్యాంక్స్

ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్ కి మద్దతుగా ఓటేసినందుకు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నెతన్యాహూ ఒక ట్వీట్ లో 'ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. భారత్ కు ధన్యవాదాలు. యుఎన్ లో ఇజ్రాయిల్ కి సహకరించినందుకు, మద్దతుగా నిలబడినందుకు' అని పేర్కొన్నారు. భారత్ ఇప్పటి వరకు పాటిస్తున్న వైఖరికి భిన్నంగా ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో ఇజ్రాయిల్ తీర్మానానికి మద్దతుగా ఓటేసింది. ఈ ఓటింగ్ జూన్ 6న జరిగింది. ఇజ్రాయిల్ తన తీర్మానంలో పాలస్తీనాకి చెందిన ఒక ప్రభుత్వేతర సంస్థకు సలహాదారు హోదా ఇవ్వడంపై అభ్యంతరం తెలియజేసింది.

ఆ సంస్థ ఉగ్రవాద సంస్థ హమాస్ తో తన సంబంధాల గురించి వివరించలేదని ఇజ్రాయిల్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో జూన్ 6న ముసాయిదా తీర్మానం 'ఎల్ 15'ని ఇజ్రాయిల్ ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి మద్దతుగా రికార్డు స్థాయిలో 28 ఓట్లు వచ్చాయి. 15 దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటేశాయి. ఐదు దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. తీర్మానానికి మద్దతుగా ఓటేసిన దేశాల్లో బ్రెజిల్, కెనడా, కొలంబియా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఐర్లాండ్, జపాన్, కొరియా, ఉక్రెయిన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ విషయంపై చర్చ జరుగుతున్నపుడు ప్రభుత్వేతర సంస్థ కీలక సమాచారం అందించడంలో విఫలమైనందువల్ల మండలి ఎన్జీవో అభ్యర్థనను తిరస్కరించాలని నిర్ణయించింది.