చంద్రయాన్‌2లో 45 రోజులు అత్యంత కీలకం..

చంద్రయాన్‌2లో 45 రోజులు అత్యంత కీలకం..

చంద్రయాన్ 2 ప్రయాణంలో వచ్చే 45 రోజులు మాకు అత్యంత కీలకం అన్నారు ఇస్రో చైర్మన్ శివన్.. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం అయిన తర్వాత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్‌ను ఉన్నతంగా ఉంచడమే తమ టార్గెట్ అన్నారు. ఇప్పుడు రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపాం.. అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుందన్నారు. మార్క్‌-3 విజయం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్న శివన్... చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. వచ్చే 45 రోజులు తమకు అత్యంత కీలకమని.. సెప్టెంబర్‌ 7న రాత్రి ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు. ఈ ప్రయోగంలో మొదట అనుకున్న సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అవి అధిగమించగలిగామన్నారు. తలెత్తిన సమస్యను గుర్తించి వారంలోనే పరిష్కరించామని.. శాస్త్రవేత్తలందరూ 24 గంటలూ శ్రమించారని ప్రశంసించారు శివన్‌. ప్రతిక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామన్నారు. శాస్త్రవేత్తల అంకితభావం, కృషి తమకు ఈ విజయాన్ని అందించిందని చెప్పారు ఇస్రో చైర్మన్.