ఐటీ సెక్టార్‌లో కొత్త టెన్షన్..! భారీగా ఉద్యోగుల తొలగింపు..!

ఐటీ సెక్టార్‌లో కొత్త టెన్షన్..! భారీగా ఉద్యోగుల తొలగింపు..!

ఐటీ సెక్టారులో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడుతుందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. నిజానికి... ఇటీవలి కాలం వరకూ దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో మందగమనం వల్లే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి కనిపించింది. అన్ని వర్గాలు దీనిపై తీవ్ర ఆందోళన చెందాయి. ఇప్పుడు ఇదేతరహాలో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు అంశం చర్చనీయాంశంగా మారింది. వ్యయాలు తగ్గించుకోవటం... సాంకేతిక మార్పుల ఫలితమే ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయేందుకూ ఇది తావిస్తోంది. ఐటీ రంగంలో వచ్చే ఏడాది కాలంలో 30 వేల నుంచి 40 వేల మంది మధ్యస్థాయి ఉద్యోగులను కంపెనీలు తొలగించే అవకాశం ఉంది. 

యూఎస్‌కు చెందిన కాగ్నిజెంట్‌ ఈ నెల మొదటి వారంలో ఉద్యోగాల కోతను ప్రకటించింది. వచ్చే కొద్ది నెలల్లో 10 వేల నుంచి 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ బ్రియాన్‌ హంఫెరీస్‌ స్పష్టం చేశారు. ఏ దేశంలో ఎంతమందిని తొలగిస్తారనేది చెప్పలేదు. అయితే... మనదేశంపై అధిక ప్రభావం ఉంటుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కాగ్నిజెంట్‌ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మనదేశంలోనే పనిచేస్తున్నారు. కొన్ని విభాగాల నుంచి తాము వైదొలుగుతున్నట్లు, అందువల్ల ఉద్యోగాల కుదింపు అనివార్యంగా మారినట్లు కాగ్నిజెంట్‌ వివరించింది. ఇక... దేశీయ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 నుంచి 150 మిలియన్‌ డాలర్ల మేరకు వ్యయాలను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పరిశ్రమ వర్గాల విశ్లేషిస్తున్నాయి. మరోవైపు...పర్సనల్‌ కంప్యూటర్లు, ప్రింటర్లు సరఫరా చేసే సంస్థ అయిన హెచ్‌పీ 'వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ'లో భాగంగా వచ్చే మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల నుంచి తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో మనదేశంలో 500 ఉద్యోగాలు ఉంటాయని అంచనా. యూఎస్‌కు చెందిన 'వుయ్‌వర్క్‌' సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 4 వేల మందిని తొలగించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్‌ మార్సెలో క్లారీ తాజాగా ఉద్యోగులకు రాసిన లేఖలో సూచనప్రాయంగా చెప్పారు. ఇందులో మనదేశంలో పనిచేస్తున్న ఆ కంపెనీ సిబ్బంది ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోంది. హైదరాబాద్‌తో సహా ముంబై, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్‌, పుణె నగరాల్లో 'వుయ్‌వర్క్‌' కార్యకలాపాలు సాగిస్తోంది. జొమాటో రెండు నెలల క్రితం గురుగ్రామ్‌లోని తన కేంద్ర కార్యాలయంలో 550 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోమేషన్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సామర్థ్యాన్ని పెంచుకుంటున్నందున ఉద్యోగుల సంఖ్య తగ్గింపు తప్పనిసరి అవుతోందని ఈ సందర్భంగా జొమాటో వివరించింది. ఐటీలో నైపుణ్యం లేని ఉద్యోగులను తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది.