మూడు రోజులుగా ఐటీ దాడులు...32 కోట్లు స్వాధీనం

మూడు రోజులుగా ఐటీ దాడులు...32 కోట్లు స్వాధీనం

తమిళనాడులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా కరూర్‌ లో ఐటీ అధికారులు జరుపుతున్న తనిఖీల్లో కుప్పలుకుప్పలుగా నగలు, నగదు పట్టుపడుతోంది. ఐటీ తనిఖీల్లో 32 కోట్ల నగదు బయటపడటం కలకలం రేపుతోంది. దోమల మందు, దోమల బ్యాట్లు, నెట్ల తయారీ  సంస్థ యజమాని ఇంట్లో ఈ నోట్ల కట్టలు గుట్టలుగా వెలుగు చూశాయ్‌. తమిళనాడు కరూర్‌లో  సోబికా అనే సంస్థ కార్యాలయం ఆ సంస్థ యజమాని శివస్వామి ఇంట్లో మూడు రోజులుగా ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెక్క బీరువాల్లో దొంతరులుగా పేర్చిన కొత్త నోట్లు చూసిన ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. తమకు అందిన సమాచారం వాస్తవమే అని నిర్ధారించుకుని సోదాలు ముమ్మరం చేశారు. లెక్కల్లో లేని అక్రమాస్తుల వివరాలు కూడా లభించాయి. సోదాలు మరికొన్ని రోజలు కొనసాగే అవకాశం ఉంది.