పతనంతిట్ట బీజేపీ అభ్యర్థిపై 4 పేజీల్లో 240 కేసులు

పతనంతిట్ట బీజేపీ అభ్యర్థిపై 4 పేజీల్లో 240 కేసులు

కేరళలోని పతనంతిట్ట ఎన్డీఏ అభ్యర్థి కె సురేంద్రన్ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓ రికార్డు సృష్టించారు. దేశవ్యాప్తంగా ఏ అభ్యర్థిపైనా లేనన్ని క్రిమినల్ కేసులు ఈయనపై నమోదయ్యాయి. కె సురేంద్రన్ పై మొత్తంగా 240 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదెవరో గిట్టనివాళ్లు చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ సురేంద్రన్ బీజేపీ సొంత వార్తాపత్రిక 'జన్మభూమి'లో నాలుగు పేజీల ప్రకటనలో కేసులు, వివరాల పట్టికను ప్రచురించుకున్నాడు.

జన్మభూమి ఏప్రిల్ 18న సురేంద్రన్ క్రిమినల్ రికార్డ్స్ ను ప్రచురించింది. ఈ ప్రకటనలో పతనంతిట్ట నుంచి పోటీ చేస్తున్న సురేంద్రన్ పై దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ క్రిమినల్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. వీటిలో చాలా వరకు కేసులు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ జరిపిన ప్రదర్శనలకు సంబంధించినవే. హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, విధులు నిర్వహించనీయకుండా అధికారులను అడ్డుకోవడం, ట్రాఫిక్ ను ఆపడం, పరువు నష్టం వంటి నేరాలను సురేంద్రన్ పై మోపడం జరిగింది.

సురేంద్రన్ పై అత్యధికంగా కేసులు కొల్లం జిల్లాలో నమోదయ్యాయి. ఇక్కడ ఆయనపై 68 కేసులు పెట్టారు. అళప్పుజలో 56, పతనంతిట్ట, కాసరగోడ్ లలో 38 కేసులు పడ్డాయి. ఇడుక్కి జిల్లాలో 17, ఎర్నాకుళంలో 13, కొట్టాయంలో 8, తిరువనంతపురంలో 3, కోజికోడ్ లో 2 కేసులు ఉన్నాయి. ఉత్తర జిల్లాలైన మలప్పురం, వాయనాడ్, కన్నూర్ లలో ఒక్కో కేసు చొప్పున నమోదు చేయడం జరిగింది. 

తమపై ఉన్న క్రిమినల్ నేరాలను పేర్కొంటూ అభ్యర్థులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో మూడు సార్లు ప్రకటనలు ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. దీంతో పోలింగ్ కి ముందే ఓటర్లకు అతని చరిత్ర తెలియాలనేది దీని ఉద్దేశం. అయితే తనపై 200కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేందుకు సురేంద్రన్ కనీసం రూ.60 లక్షలకు పైగా ఖర్చుచేసి ప్రకటనలు ఇచ్చినట్టు చెబుతున్నారు.