2018-19కి ఆదాయపన్ను రిటర్న్ ఫార్మ్స్ జారీ.. ఈ వివరాలు చెప్పాలి

2018-19కి ఆదాయపన్ను రిటర్న్ ఫార్మ్స్ జారీ.. ఈ వివరాలు చెప్పాలి

ఆదాయపన్ను శాఖ ఆర్థిక సంవత్సరం 2018-19కి ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫార్మ్స్ జారీ చేసింది. ఆదాయపన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఫార్మ్-1 నుంచి 4 వరకు జారీ చేసింది. ఈ ఐటీఆర్ లలో పన్ను చెల్లింపుదారులు భారత్ లో ఎన్ని రోజులు నివసించారు, అద్దెకి ఉంటున్నవారి ప్యాన్ నెంబర్, ఆస్తి వివరాలను కూడా ఐటీ శాఖ చేర్చింది. 

ఐటీఆర్-1లో ఈ వివరాలు ఇవ్వాలి
రూ.50 లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఆర్జిస్తున్నవారు, ఒక ఇల్లు ఉన్నవారు, వడ్డీ ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నవారు ఐటీఆర్-1 ఫార్మ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నవారు లేదా ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టినవారు ఈ ఫార్మ్ ని ఉపయోగించరాదు.

ఈ ఐటీఆర్ ఫార్మ్ లో ఇల్లు ఉన్నవారు ఆ ఇంటిని తమ సొంతానికి ఉపయోగిస్తున్నారా లేదా కిరాయికి ఇచ్చారా అనేది తెలపాలి. ఆదాయం ఆర్జిస్తున్న ఇతర మార్గాల వివరాలు పేర్కొనాలి. గత ఏడాది మాదిరిగా ఈ సారి కూడా వేతనం బ్రేకప్, అన్ని రకాల భత్యాల గురించి సమాచారం ఇవ్వాలి.

ఐటీఆర్-2లో భారత్ లో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలి
సాధారణ పన్ను చెల్లింపుదారులు, అవిభాజ్య హిందూ కుటుంబం ఐటీఆర్-2ని దాఖలు చేయాలి. ఎలాంటి వ్యాపారం ద్వారా వచ్చే లాభం ఆదాయంగా ఉన్నవారికి ఇది వర్తించదు. ఈ సారి ఐటీఆర్-2 ఫార్మ్ లో భారత్ లో ఎన్ని రోజులు నివసించారో తెలపాల్సి ఉంటుంది. 

 

ఇందులో 60 రోజుల నుంచి గత నాలుగేళ్లలో 365 రోజుల నివాసం చేర్చారు. ఎవరైనా పన్ను చెల్లింపుదారులు షేర్ మార్కెట్ లో లిస్ట్ కానీ ఏదైనా కంపెనీ షేర్ తీసుకుంటే ఆ కంపెనీ పేరు, ప్యాన్, షేర్ల సంఖ్య వివరాలు తెలియజేయాలి.

 

ఈ ఫార్మ్ లు కూడా జారీ అయ్యాయి
ఆదాయపన్ను శాఖ ఐటీఆర్-3, ఐటీఆర్-4లను కూడా జారీ చేసింది. ఈ రెండు ఫార్మ్ లలో ఎలాంటి కొత్త సమాచారం ఇవ్వాలని సూచించలేదు.

ఐటీఆర్ లో ఈ సమాచారం తప్పక ఇవ్వండి 
మీరు పొరపాటున తప్పు రిటర్న్ ఫైల్ చేసినా లేదా ఏదైనా సమాచారం దాచిపెట్టినా ఆదాయపన్ను శాఖ మీ రిటర్న్ ను తిరస్కరించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, ఫండ్ వంటి వాటి ద్వారా పన్ను రాయితీ లభించే అవకాశం ఉంటే దానిని వినియోగించుకోవాలి. 

వ్యాపారులు, ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ సంస్థ ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో వార్షికాదాయం, దేశవిదేశాల్లోని బ్యాంకు ఖాతాల సమాచారం, దేశవిదేశాల్లోని ఆస్తులు, ఎఫ్ డీలపై లభించే వడ్డీ, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం, ఏడాదిలో చేసిన విదేశీ యాత్రలు వంటి సమాచారం ఐటీ శాఖ నుంచి దాచిపెట్టవద్దు.

అలాంటి సంపద, ఆదాయం, ఖాతాల వివరాలు చెప్పకపోతే ఆదాయపన్ను శాఖ 100 శాతం జరిమానా విధించవచ్చు. రిటర్న్ ఫైల్ చేసేటపుడు ట్యాక్స్ సేవింగ్ బాండ్, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పీఎఫ్, హోమ్ లోన్ లపై చెల్లించే వడ్డీ గురించి పేర్కొని ప్రయోజనం పొందవచ్చు.