35 ఏళ్ళ క్రితం మురిపించిన 'ముద్దుల క్రిష్ణయ్య' 

35 ఏళ్ళ క్రితం మురిపించిన 'ముద్దుల క్రిష్ణయ్య' 

నటసింహ నందమూరి  బాలకృష్ణ కెరీర్ లో 1986 సంవత్సరం మరపురానిది... మరువలేనిది... ఆ యేడాది బాలయ్య  వరుసగా ఆరు సూపర్ హిట్స్ చూశారు. ఈ నాటికీ ఆ రికార్డు ఆయనకే సొంతం. అంతటి ఘనవిజయానికి శ్రీకారం చుట్టిన చిత్రంగా 'ముద్దుల క్రిష్ణయ్య' నిలచింది. ఈ చిత్రాన్ని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్  పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించారు. 1986 ఫిబ్రవరి 28న విడుదలైన 'ముద్దుల క్రిష్ణయ్య' విజయఢంకా మోగించింది. 

జనం మనసులు గెలిచిన చిత్రం
బాలకృష్ణ చిత్రసీమలో అడుగు పెట్టిన సమయంలో ఆయనను వరుసగా మూడు ఫ్లాపులు పలకరించాయి.. ఆ సమయంలో నాలుగో చిత్రంగా వచ్చిన 'మంగమ్మగారి మనవడు' అనూహ్య  విజయం సాధించింది. అంతకు ముందు తెలుగునాట సినిమా రన్నింగ్ లో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. హైదరాబాద్ లో ఏకంగా 565 రోజులు మూడు ఆటలతో ప్రదర్శితమై ఈ నాటికీ ఓ రికార్డుగా నిలచే ఉంది.. బాలకృష్ణ కెరీర్ లో తొలి ఘనవిజయంగా నిలచిన 'మంగమ్మగారి మనవడు'ను భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్  ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించారు. ఆ బ్యానర్ లో బాలయ్య  రెండోసారి నటించిన చిత్రం 'ముద్దుల క్రిష్ణయ్య'. ఈ సినిమాకూ కోడి రామకృష్ణనే డైరెక్టర్. దాంతో  'ముద్దుల క్రిష్ణయ్య' ఆరంభమైన రోజు నుంచీ అభిమానుల్లో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అందుకు తగ్గట్టుగానే 'ముద్దుల క్రిష్ణయ్య' అలరించింది. 1986లో బాలకృష్ణ నటించిన తొలి చిత్రంగా 'నిప్పులాంటి మనిషి' విడుదలైంది. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే 'ముద్దుల క్రిష్ణయ్య' విడుదలై విజయనాదం చేసింది. 
ఈ సినిమా తరువాత  బాలకృష్ణ  వరుసగా "సీతారామకళ్యాణం,  అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు" చిత్రాలతోనూ హిట్స్ ను సాధించారు. అలాంటి రికార్డు ఈ నాటికీ మరొకరికి దక్కలేదు. అంతలా 1986 సంవత్సరం బాలయ్యకు, ఆయన అభిమానులకు మరపురాని సంవత్సరంగా నిలచిపోయింది. అంతటి అపూర్వ విజయానికి శ్రీకారం చుట్టిన చిత్రంగా 'ముద్దుల క్రిష్ణయ్య' నిలచి, జనం మనసులు గెలిచింది. 

కథ ఏంటంటే... 
'ముద్దుల క్రిష్ణయ్య' కథ విషయానికి వస్తే- అత్తా అల్లుళ్ళ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో ఈ సినిమా కథ సాగుతుంది. క్రిష్ణయ్య  అంటే ఆ ఊళ్ళో  అతని మేనమామ భార్యకు తప్ప అందరికీ  ఎంతో అభిమానం. ఆమె చేసే ఆగడాలకు అడ్డుపడుతూ ఉంటాడు క్రిష్ణయ్య. ఆమె కూతురు రాధనే పెళ్లాడవలసి వస్తుంది. అయితే భర్తంటే లెక్క చేయక వదిలేసి పుట్టింటికి పోతుంది రాధ. ఆ సమయంలో శాంతి అనే అమ్మాయి వచ్చి  క్రిష్ణయ్య  ఇంట్లో ప్రవేశిస్తుంది. ఆమె వల్లే క్రిష్ణయ్య  భార్య మళ్ళీ భర్తను చేరుకుంటుంది. ఆ అమ్మాయి ఓ సినిమా హీరోయిన్. క్రిష్ణయ్య చిన్నప్పటి స్నేహితురాలు. అతని కాపురం చక్కదిద్ది శాంతి మళ్ళీ  సినిమాలకు వెళ్లడంతో కథ ముగుస్తుంది. భార్గవ్ ఆర్ట్స్ యూనిట్ సమకూర్చిన ఈ కథ విశేషాదరణ చూరగొంది. 

అలరించిన పాటలు, పద్యాలు!
'ముద్దుల క్రిష్ణయ్య' చిత్రంలో విజయశాంతి, రాధ నాయికలుగా నటించగా, హీరో మేనత్త పాత్రలో ఎస్.వరలక్ష్మి అభినయించారు. ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు, కె.కె.శర్మ, టెలిఫోన్ సత్యనారాయణ, వై.విజయ, కల్పనారాయ్, నిర్మలమ్మ నటించారు. ఈ చిత్రానికి గణేశ్ పాత్రో మాటలు రాయగా, పాటలను సి.నారాయణరెడ్డి రచించారు. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులోని ఆరు పాటలూ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కథానుగుణంగా అత్తాఅల్లుళ్ళ  మధ్య ఓ సీన్ లో పద్యాలు పెట్టాలన్న ఆలోచన రావడం, దానిని ఆచరణలో పెట్టడం జరిగిపోయాయి. అత్తగా నటించిన ఎస్.వరలక్ష్మి స్వయంగా గాయకురాలు. అందువల్ల ఆమె స్వయంగా పాడుకున్నారు. ఇక ఆ సీన్ లో బాలయ్యకు రామకృష్ణ గానం చేయడం విశేషం. సినిమాలోని మిగిలిన పాటలన్నీ బాలు పాడారు. ఆ పద్యాల సీన్ కూడా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. 

అభిమానుల ఆనందం
 'ముద్దుల క్రిష్ణయ్య' అనగానే అభిమానులకు ఆ చిత్రంలోని పలు అంశాలు ఇట్టే గుర్తుకు వస్తూ ఉంటాయి. 
ఈ సినిమాలో బాలకృష్ణ ఒకే ఒక్క సీన్ లో అదీ కొన్ని నిమిషాలు మాత్రమే  ఫ్యాంట్స్ వేసుకొని కనిపిస్తారు... మిగిలిన సినిమా అంతటా ఆయన బిగుతైన పంచెకట్టుతో కనిపిస్తారు.... అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ ను మినహాయిస్తే ఇలా సినిమా పొడుగునా పంచెకట్టుతో కనిపించి బంపర్ హిట్ కొట్టడం అన్నది బాలయ్యకే చెల్లింది... దీనిని బాలయ్య  ఫ్యాన్స్ ఈ నాటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. 

 కోటి రూపాయల తొలి తెలుగు సినిమా!
ఈ సినిమా సమయానికి బాలకృష్ణ సోలో హీరోగా అడుగు పెట్టి కేవలం రెండు సంవత్సరాలు అయింది... మొదటి సంవత్సరంలోనే 'మంగమ్మగారి మనవడు, కథానాయకుడు' వంటి బంపర్ హిట్స్ చూశారు బాలయ్య,. ఆ తరువాత యేడాది విడుదలైన బాలకృష్ణ 'పట్టాభిషేకం' సినిమా మొదటి వారం 96 లక్షల పైచిలుకు గ్రాస్ వసూలు చేసి సాంఘిక చిత్రాల్లో రికార్డుగా నిలచింది... ఆ సినిమా తరువాత ఓపెనింగ్ కలెక్షన్లలో ఎవరు ముందుగా కోటి రూపాయలు చూస్తారో అన్న ఆసక్తి సినీ ప్యాన్స్  లో నెలకొంది.. ఆ సమయంలో ఇదిగో 'ముద్దుల క్రిష్ణయ్య' సాధించాడు అంటూ ఈ సినిమా మొదటి వారం వసూళ్ళను పేపర్ లో ప్రకటించారు. ఈ సినిమా మొదటి వారం 1 కోటి 9 లక్షల 91 వేల నాలుగు వందల ఒక్క రూపాయి సాధించింది. దాంతో అభిమానుల ఆనందం అంబరమంటింది. 

షిఫ్ట్ అయ్యాక డైరెక్ట్ జూబ్లీ!
'ముద్దుల క్రిష్ణయ్య' సినిమా విడుదలైన మొదటి వారం బీభత్స కాండ సృష్టించింది. ఆ తరువాత ఎందుకనో పలు చోట్ల సినిమా టాక్ డివైడ్ గా సాగింది. దీంతో ఈ సినిమాను కొన్ని కేంద్రాలలో మూడు వారాలకే ఎత్తేశారు. అయితే నాలుగు వారాలు దాటిన తరువాత అనూహ్యంగా 'ముద్దుల క్రిష్ణయ్య' టాక్ రైజ్ అయింది. ఈ చిత్రంలో బూతులు ఉన్నాయి అంటూ ప్రచారం సాగింది. ఆడవాళ్ళు చూడలేరనీ చాటింపు వేశారు. అయితే అన్నిటినీ తోసిరాజని 'ముద్దుల క్రిష్ణయ్య' విజయభేరీ మోగించింది.  
ఈ సినిమాను విజయవాడ లాంటి పెద్ద కేంద్రంలో కూడా 21 రోజులకే షిఫ్ట్ చేశారు. మొదట అన్నపూర్ణ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం తరువాత పక్కనే ఉన్న శకుంతలకు మార్చారు. చిత్రమేమంటే, ఈ సినిమాను షిఫ్ట్ చేశాక ఏకధాటిగా 101 రోజులు ఫుల్స్ తో నడిచింది. అంతేకాదు షిఫ్ట్ అయ్యాక ఆ థియేటర్ లో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఆ రోజుల్లో ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నారు. 

మరపురాని రికార్డులు
'ముద్దుల క్రిష్ణయ్య' చిత్రం నాలుగువారాల తరువాత ఊపందుకొని మొత్తం 28 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 20 కేంద్రాలలో రజతోత్సవం చూసింది. 10 కేంద్రాలలో రెండు వందల రోజులు నడిచింది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ - మూడు కేంద్రాలలో స్వర్ణోత్సవం చేసుకుంది. యన్టీఆర్, ఏయన్నార్ తరువాత మూడు కేంద్రాలలో స్వర్ణోత్సవం చూసిన ఏకైక హీరోగా బాలకృష్ణను నిలిపింది 'ముద్దుల క్రిష్ణయ్య'. 
'ముద్దుల క్రిష్ణయ్య' చిత్రంపై ఆరంభంలో పలు విమర్శలు వినిపించినా, తరువాత ఈ చిత్రంలోని వినోదం  జనాన్ని కట్టిపడేసింది. అంతలేందే అప్పట్లో చిన్న సెంటర్స్ అయిన కైకలూరు, నూజివీడు, రేపల్లె వంటి కేంద్రాలలో తొలి  శతదినోత్సవ చిత్రంగా 'ముద్దుల క్రిష్ణయ్య'  రికార్డు సృష్టిస్తుందా!? ఇక ఈ సినిమా వందరోజుల వేడుకను వల్లువార్ కొట్టంలో నిర్వహించారు. కనీవినీ ఎరుగని రీతిలో అభిమానులు ఆ విజయోత్సవంలో పాల్గొన్నారు. ఓ తెలుగు హీరో చిత్రానికి తమిళనాడులో ఆ స్థాయిలో జనాలు హాజరయిన వేడుక మరొకటి కానరాదు. 

పెరిగిన హీరో పారితోషికం!
బాలకృష్ణ పారితోషికాన్ని భారీగా పెంచేసిన సినిమా 'ముద్దుల క్రిష్ణయ్య' అనే చెప్పాలి. అంతకు ముందు బాలయ్య  నటించిన చిత్రాలకు ఒక్కో సినిమాకు రెండు నుండి మూడు లక్షల లోపు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. 'ముద్దుల క్రిష్ణయ్య' నిర్మాణ వ్యయం కేవలం పదిహేను లక్షలు. ఈ చిత్రాన్ని గోపాల్ రెడ్డి కోటి రూపాయలకు పైగా అమ్మారు. దాంతో తన హీరోకు అందరికంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని భావించారు. అంతకు ముందు కొందరు సీనియర్ స్టార్స్  మాత్రమే సినిమాకు  పది లక్షలకు పైగా తీసుకొనేవారు. వారికంటే ఎక్కువ ఇవ్వాలని భావించిన ఎస్. గోపాల్ రెడ్డి బాలయ్యకు పదమూడు లక్షల పారితోషికం ఇచ్చారు. ఆ రోజుల్లో మదరాసులో ఈ విషయాన్ని విశేషంగా ముచ్చటించుకున్నారు. 

మరపురాని నిర్మాత!
బాలకృష్ణకు ఇది రెండవ స్వర్ణోత్సవ చిత్రం. దీని తరువాత "ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్" చిత్రాలు సైతం స్వర్ణోత్సవాలు జరుపుకున్నాయి. తెలుగునాట యన్టీఆర్ తరువాత అత్యధిక స్వర్ణోత్సవ చిత్రాలు గల హీరోగా బాలయ్య  రికార్డు నెలకొల్పారు. అందులో భార్గవ్ ఆర్ట్స్  నిర్మించినవే మూడు చిత్రాలు ఉండడం విశేషం. అందుకే భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్  అంటే బాలయ్య అభిమానులకు ప్రత్యేక అభిమానం. చిత్ర నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి అంటే మరింత గౌరవం. ఆయన ప్రస్తుతం లేకపోయినా, గోపాల్ రెడ్డి అందించిన విజయాలను తలచుకుంటూ ఉంటారు బాలయ్య అభిమానులు.