ఓవర్ టైమ్ పని సంస్కృతి వివాదంలో చిక్కుకున్న జాక్ మా

ఓవర్ టైమ్ పని సంస్కృతి వివాదంలో చిక్కుకున్న జాక్ మా

తమ సంస్థలో ఉద్యోగం చేయాలంటే రోజుకు 12 గంటలు, వారంలో 6 రోజులు పని చేయాల్సిందేనని చైనాలో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం అంటే 8 గంటలు మాత్రమే పని చేయాలని ఆలోచించేవారు తనకు అక్కర్లేదని మా అన్నారు. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం జాక్ మా వ్యాఖ్యలపై సోషల్ మీడియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక అంతర్జాతీయ సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 6 రోజులు పనిచేసే 996 పని సంస్కృతిని మా సమర్థించారు. చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో అలీబాబా అధికారిక అకౌంట్ లో దీని గురించి ప్రస్తావించారు. 996 ప్రకారం పని చేయడంలో ఎంతో ఆనందం లభిస్తుందని జాక్ మా అన్నారు. మీరు ఆలీబాబా జాయిన్ కావాలంటే 12 గంటలు పని చేసేందుకు సిద్ధమై ఉండాలని లేకపోతే కంపెనీలో చేరి ఇబ్బందులు పడవద్దని మా సూచించారు.

చైనాలో అత్యంత ధనవంతుడైన జాక్ మా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీబోలో ఒక యూజర్ జాక్ మా ఆలోచనా విధానం పనికిమాలిన చెత్తగా కొట్టి పారేశారు. మరో యూజర్ ఆలీబాబా కంపెనీ 996 షెడ్యూల్ కి ఎంత ఓవర్ టైమ్ కాంపెన్సేషన్ ఇస్తుందో జాక్ మా చెప్పలేదని అన్నారు. తమ వాదనలు పక్కనపెట్టి చట్టాలను పాటించాలని సూచించారు. తన కోసమే పని చేసే బాస్ 996ని ఫాలో చేయాల్సి ఉంటుందని, దాంతో ఆయన సంపద పెరుగుతుందని మరో యూజర్ వ్యాఖ్యానించారు. మాకు ఓవర్ టైమ్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా పీల్చి పిప్పిచేసినా మేం 996 పని చేస్తామని చెప్పారు.

ఓవర్ టైమ్ అంశంపై చైనాలో భారీ స్థాయిలో వాదోపవాదాలు చెలరేగుతున్న సమయంలో జాక్ మా వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. మార్చిలో 996.ఐసీయు బ్యానర్ కింద చైనా టెక్ ఇండస్ట్రీ ప్రోగ్రామర్లు పని షరతులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అదనపు మొత్తం చెల్లించకుండా ఎక్కువ పని చేయించుకొనే కంపెనీలలో పనిచేసే టెక్ ఇండస్ట్రీ ఉద్యోగులు ముందుకు రావాలని దీని ద్వారా కోరారు. ఇలాంటి కంపెనీలలో ఆలీబాబా, ఆయనదే మరో కంపెనీ ఆంట్ ఫైనాన్షియల్ ఉన్నాయి. 

చైనా టెక్ ఇండస్ట్రీలో ప్రోగ్రామర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు హఠాత్తుగా మరణిస్తున్న చాలా సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అధిక పని గంటలు, ఒత్తిడి ఈ మరణాలకు కారణమని చెబుతున్నారు. మార్చిలో జరిపిన నిరసన ప్రదర్శన సందర్భంగా కూడా ప్రోగ్రామర్లు ఇదే చెప్పారు. 996 వర్క్ షెడ్యూల్ ఫాలో అయితే మీరు ఐసీయులో చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.