కడపలో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు డేట్‌ ఫిక్స్‌

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు డేట్‌ ఫిక్స్‌

కడప ఉక్కు కర్మాగారానికి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఇవాళ  'రైతు దినోత్సవ' సభలో జగన్‌ ప్రసంగించారు. ఉక్కు కర్మాగారం ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, వ్యవసాయ లేబోరేటరీలను ఏర్పాటు చేస్తామని, రైతులకు నాణ్యమైన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు అందజేస్తామని చెప్పారు. 

చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. కరవు ప్రాంతం నుంచి వ్యక్తినైనందునే  ప్రాజెక్టుల ప్రయోజనం గురించి తనకు తెలుసని అన్నారు. మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్లుగా ఉంటారని జగన్‌ చెప్పారు.  భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడతామని, కౌలు రైతులకు అండగా ఉంటామని చెప్పారు.