ఆ ఆశ కూడా లేకుండా చేశారు: జగన్‌

ఆ ఆశ కూడా లేకుండా చేశారు: జగన్‌

మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఇంత హడావుడి చేస్తున్నారంటే, ఇంతగా ప్రలోభాలకు దిగుతున్నారంటే రాజకీయాలు ఎంతగా దిగజారాయో ప్రజలందరికీ కనబడుతోందని.. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలోని బడ్జెట్‌లో వాగ్దానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయటంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్‌డీ తీసుకున్నారని అర్థం అవుతోందన్నారాయన. ఈ బడ్జెట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇవ్వనిది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో ఇస్తుందని ఎవరు అనుకుంటారన్న జగన్‌.. ఏపీకి న్యాయం చేసైనా ఎన్నికలకు వెళ్తారు అన్న ఆశ కొద్దిగా ఎవరికైనా మిగిలి ఉంటే అది లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలకు గుణపాఠం తప్పదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి చేతకానివాడు అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని జగన్‌ అన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు లొంగుబాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న జగన్‌.. ఆ తర్వాతే ప్రత్యేక హోదాను చంద్రబాబు వదిలేసి లేని ప్యాకేజీ ఊకొట్టారని చెప్పారు. నాలుగేళ్లుగా ఏ బడ్జెట్‌ను కూడా చంద్రబాబుగానా, కేంద్రంలో అప్పుడున్న ఆయన మంత్రులుగానీ వ్యతిరేకించలేదని జగన్‌ విమర్శించారు.