ప్రజలు కూడా మారాలి..అలవాట్లు మార్చుకోవాలి

ప్రజలు కూడా మారాలి..అలవాట్లు మార్చుకోవాలి

జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీలో మార్పులు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరులో ఆరోగ్య ఆసరా పథకంను ప్రారంభించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ చికిత్స తర్వాత కోలుకునే సమయంలో ఆర్థికసాయం చేస్తామని అన్నారు. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన వారి కోసం ఈ పథకంను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ఆసరా పేరుతో ఈ పథకంను ప్రారంభిస్తున్నామన్నారు. వైద్య రంగంలోనే ఒక విప్లవానికి నాంది  పలుకుతున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని 2000 రోగాలకు పెంచుతూ మార్పులు తెస్తున్నామన్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. సంవత్సరానికి రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీని వర్తంపజేస్తామన్నారు. జనవరి 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 
ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ, దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే బాధగా ఉంటోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.   నా కులం మాట నిలబెట్టుకునే కులం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని పనిచేస్తున్నా" అని జగన్ అన్నారు. ఓ గొప్ప కార్యక్రమానికి నేడు అంకురార్పణ జరిగిందని, వైద్యం చేయించుకునేందుకు ఇకపై ఏ పేదవాడూ ఇబ్బందులు పడబోడని హామీ ఇస్తున్నానని అన్నారు. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. వైద్యంతో పాటు ప్రజలు కూడా మారాలని, అలవాట్లు మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. అందుకే మద్యం నియంత్రణ చేయడం కోసం మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా చేశామని అన్నారు. ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసినా గట్టిగా నిలబడతా మిమ్మల్ని, దేవుణ్ణి నమ్ముకున్నానన్న  జగన్ మీ అభిమానంతోనే సాగుతానని అన్నారు.