ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని జగన్ దెబ్బతీశారు

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని జగన్ దెబ్బతీశారు

ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని వైసీపీ అధినేత జగన్ దెబ్బతీస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ జీవితం అడ్డదారి, వైసీపీది చెడుదారి అని వివరించారు. వ్యాపారం.. రాజకీయం రెండింటిల్లోనూ జగన్ ది అడ్డదారేనని అన్నారు. చట్టంలో ఎన్ని నేరాలున్నాయో అన్ని రకాల నేరాలు చేశారన్నారు. జగన్‌ ఇప్పటి వరకు ఆర్థిక నేరాలే చేశారని, కానీ ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త నేరాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి దివాళాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ డేటా దొంగిలించడానికి ప్రయత్నించి జగన్‌ అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. ఒక ప్లాన్‌ ప్రకారం పాయింట్ల వారీగా రాసుకుని మరీ టీడీపీపై కుట్ర చేశారన్నారు. ఈసీకి విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖలో వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు. వైసీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి ఈ డ్రామా నడిపారని తెలిపారు. ఇంతకు ముందు కూడా పంటలు తగలబెట్టడం లాంటి అరాచకాలు చాలా చేశారని గుర్తుచేశారు. నేరాలు చేయడంలో గ్రాండ్‌ మాస్టర్‌ అంటూ జగన్‌ను చంద్రబాబు విమర్శించారు.

డేటా చోరీ విషయంలో యాక్షన్ ప్లాన్ కూడా రాసిచ్చేసి దొరికిపోయారు. రాజధానిలో తోటలు తగలబెట్టడం దగ్గర్నుంచి అన్ని రకాల నేరాలూ చేశారు. నేరాల్లో గ్రాండ్ మాస్టర్ జగన్. జగన్ చుట్టూ ఉన్న వాళ్లు కూడా నేరాలు చేయడంలో మాస్టర్ మైండ్స్. నేను పరిపాలనలో ఇన్నోవేషన్ ఉండాలంటే.. జగన్ నేరాల్లో ఇన్నోవేటీవ్ గా ఉంటున్నారు. జగన్ నేరాలను ఈడీ నిర్ధారించినా.. సీబీఐ తొక్కి పెట్టింది. కూకట్ పల్లిలో ఇందూ ప్రాజెక్టుకు నిబంధనలు తొక్కి పెట్టి వంద ఎకరాల భూమిని ఇచ్చారు. వారి వద్ద నుంచి జగన్ 11 ఎకరాలు తీసుకున్నారు. దేశానికి కాపలదారుడని చెప్పుకుంటున్న మోడీ.. ఈ కేసును తొక్కి పెట్టారు. మోడీ దేశానికి కాపలాదారు కాదు.. దొంగలకు కాపలాదారు. డొల్ల కంపెనీల ద్వారా నగదు బదిలీలు చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. క్విడ్ ప్రోకోకు ఇంతకు మించిన ఆధారం దొరకదు. జగన్, విజయసాయిలకు చెందిన బినామీ కంపెనీ పేర్లతో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాన్ని స్వయంగా ఈడీనే నిర్ధారించిందని చంద్రబాబు స్పష్టం చేశారు.