ఇకపై నేరుగా మీ ఇంటికే పెన్షన్‌: జగన్‌

ఇకపై నేరుగా మీ ఇంటికే పెన్షన్‌: జగన్‌

ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 'నవరత్నాల'కు కడప నుంచే శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో  కడప జిల్లాకు జగన్‌ ఇవాళ తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో నిర్వహించిన 'రైతు దినోత్సవం' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ పెన్షన్‌ పథకం కింద అవ్వాతాతలకు రూ.2,250, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్‌ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు గ్రామ వలంటీర్ల ద్వారా పెన్షన్‌కు అర్హులను గుర్తిస్తామన్న తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి నేరుగా అర్హుల ఇంటికే పెన్షన్‌ వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకున్నామన్న ఆయన.. పెన్షన్‌ రాని అర్హులు నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు కోసం ప్రత్యేక నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.