జగన్ కు అథవాలే మళ్లీ ఆహ్వానం

జగన్ కు అథవాలే మళ్లీ ఆహ్వానం

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలోకి రావాలాని  కేంద్ర సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే ఆహ్వానించారు. హైదరాబాద్‌లో తమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... జగన్‌ రావటానికి సుముఖంగా ఉంటే అమిత్‌షా, మోడీని తాను ఒప్పిస్తానని తెలిపారు. ఏపీ సీఎం కావటానికి కూడా తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్డీఏతోనే ఉంటే డిమాండ్లు నెరవేరేవని అథవాలే అభిప్రాయపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీకే లాభం అన్నారు.  ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని పరిరక్షించేందుకు ఆర్డినెన్స్‌ లేదా వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో చట్ట సవరణ తీసుకొస్తామన్నారు. మరోవైపు.... అథవాలే వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది.  జగన్‌ను తమ కూటమిలోకి వస్తే సీఎంను చేస్తామంటూ ఎన్డీయే నాయకులు ఆహ్వానించటాన్ని తప్పుపట్టింది. రాష్ట్రంలో వారి కుట్ర రాజకీయాలకు అదే నిదర్శనమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బీజేపీకి ఏపీలో బలం లేదని పేర్కొన్నారు. అందుకే జగన్‌ను పట్టుకుంటున్నారని విమర్శించారు. వైసీపీకీ కూడా ఇక్కడేమీ లేదనీ... కేసుల నుంచి బయట పడటానికి వాళ్లు ఎవర్నో ఒకర్ని పట్టుకోవాలని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతిపరుల్ని అడ్డంపెట్టుకుని బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.