హైదరాబాద్ బయలుదేరిన జగన్

హైదరాబాద్ బయలుదేరిన జగన్

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ బయల్దేరారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా జగన్‌ బృందం రాజ్‌భవన్‌ చేరుకొని గవర్నర్‌తో సమావేశం కానుంది. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన ప్రమాణస్వీకారోత్సవానికి జగన్‌ ఆహ్వానించనున్నారు. 

మరోవైపు, రేపు జగన్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్‌ జగన్‌ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. కాగా వైఎస్‌ జగన్‌ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ జగన్‌ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని వైఎస్‌ జగన్‌ కోరనున్నారు.