ప్రధానితో భేటీ అయిన వైఎస్ జగన్

ప్రధానితో భేటీ అయిన వైఎస్ జగన్

భారత ప్రధాని నరేంద్రమోడీతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని అధికార నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్ కు చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ తిరిగి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 30న జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్‌ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మోడీని కలిసిన జగన్‌ బృందంలో లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు. మోడీతో భేటీ అనంతరం జగన్‌ ప్రధాని నివాసం నుంచి ఏపీ భవన్‌కు చేరుకున్నారు. అనంతరం ఏపీ భవన్‌ సిబ్బందితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. స్థానికంగా తనను కలవడానికి వచ్చేవారితోనూ జగన్‌ మాట్లాడనున్నారు. ఢిల్లీలోని ఏపీ క్యాడర్‌ అధికారులు ఆయన్ని కలవనున్నారు. మధ్యాహ్న భోజనం ఏపీ భవన్‌లోనే చేసి సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని ఏపీ భవన్‌ వర్గాలు వెల్లడించాయి.