ఆ ముగ్గురు ముందే కుమ్మక్కయ్యారు..

ఆ ముగ్గురు ముందే కుమ్మక్కయ్యారు..

అభివృద్ధి, మెరుగైన పనుల కోసం అందరూ క్రియేటీవ్‌గా ఆలోచిస్తే.. జగన్ మాత్రం కుట్రల కోసం ఆలోచిస్తారంటూ విమర్శించారు. ప్రజావేదికలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, జగన్, మోడీ ముందే కుమ్మక్కయ్యారని.. ఈడీ రాసిన లేఖే దానికి నిదర్శనమన్నారు. జగన్‌ లూటీ ఎలా చేశాడో ఈడీ డైరెక్టర్‌ కర్నాల్‌ సింగ్‌ స్పష్టంగా రాశారన్నారు. హిందూజా కేసులో జగన్‌ క్విడ్‌ ప్రోకో కింద 11 ఎకరాలు రాయించుకున్నారని.. షెల్ కంపెనీలు సృష్టించి.. రూ. 40 కోట్లు చేతులు మారినట్లు చూపించి 11 ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ ఈడీ తవ్వి తీసిందన్నారు. సీబీఐని దర్యాప్తు చేయాలని ఈడీ కోరిందని.. అయినా మోదీ అవన్నీ తొక్కిపెట్టారన్నారు. జగన్‌, మోడీ ఒక్కటే అని చెప్పేందుకు ఇదే తిరుగులేని రుజువన్నారు. మోడీతో ఏ1 జగన్‌, ఏ2 సాయిరెడ్డి ఒక అవగాహనకు వచ్చి.. ఈ కథ నడిపించారన్నారు. 11 ఎకరాలు అప్పనంగా కొట్టేశారని తెలిసినా .. కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ కూడా ఈ కుట్రలో భాగమయ్యారన్నారు. మోడీతో జగన్‌ కుమ్మక్కయితే .. కేసీఆర్‌ వారిద్దరికి కాపలాదారుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 
 
హిందూజా భూముల్ని హిందూజా డబ్బులతోనే కొన్నట్లు చూపించి.. అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి జగన్‌ అన్నారు. తనే ఏం చేసినా చెల్లుతుందనుకునే నేరస్తుడు జగన్ అని.. కేంద్రం ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో.. కర్నాల్‌ సింగ్‌ రాసిన లేఖ స్పష్టంగా చెబుతోందన్నారు. అవినీతిపరులు, దొంగలకు నరేంద్ర మోడీ కాపలాదారని.. అందుకే జగన్‌ను అడ్డంగా వెనకేసుకొచ్చారన్నారు. ఇలాంటి వారు దేశాన్ని కాపాడతారా అంటూ మండిపడ్డారు. యాగా అసోసియేట్స్‌ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి.. హిందూజా సొమ్మును ఆ కంపెనీకి మళ్లించి.. వారి ల్యాండ్‌ని కొన్నట్లుగా.. జగన్‌ దొంగలెక్కలు చూపించారని చంద్రబాబు అన్నారు.