ఆ ఇద్దరి పుట్టిన రోజు కానుకగా 'ఎఫ్.సి.యు.కె.'

ఆ ఇద్దరి పుట్టిన రోజు కానుకగా 'ఎఫ్.సి.యు.కె.'

జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న సినిమా 'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్' (ఎఫ్.సి.యు.కె.). శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ లో కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకుడు. కార్తీక్, అమ్ము అభిరామి ఇందులో జంటగా నటించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ లో నిర్మితమైన తొలి చిత్రం 'అలా మొదలైంది' పదేళ్ళ క్రితం జనవరి 21న విడుదలైందని, ఆ తర్వాత ఇదే బ్యానర్ లో వచ్చిన చిత్రాలూ తనకెంతో గుర్తింపును తెచ్చిపెట్టాయని నిర్మాత దామోదర ప్రసాద్ తెలిపారు. తమ తాజా చిత్రం  'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్'ను ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. తన తండ్రి రంజిత్ కుమార్ తెలుగు సినిమా రంగంలో ఉత్తమమైన చిత్రాలు నిర్మించారని, ఆయన స్ఫూర్తితోనే తానూ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని, తమ సంస్థకు చెడ్డపేరు తీసుకొచ్చే చిత్రాలు ఎప్పటికీ తీయనని దామోదర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమా పేరు 'ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్'ను షార్ట్ ఫామ్ లో చేసి 'ఎఫ్.సి.యు.కె' గా ప్రచారం చేయడం కేవలం వాణిజ్య పరమైనదే తప్ప మరొకటి కాదని, సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దీనిని మెచ్చుకుంటారని అన్నారు. ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, మిత్రుడు విద్యాసాగర్ రాజు తనతో చక్కని పాత్ర చేయించారని, బేబీ సహర్షిత, కార్తీక్, అమ్ము అభిరామి పాత్రలూ అందరికీ నచ్చుతాయని జగపతి బాబు తెలిపారు.
ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజు, తమ నిర్మాత దామోదర ప్రసాద్ జన్మదినం నాడే (ఫిబ్రవరి 12న) ఈ సినిమా విడుదల కాబోతుండటం ఆనందంగా ఉందని దర్శకుడు విద్యాసాగర్ రాజు అన్నారు. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉందని, అయినా... మరీ ఆలస్యం కాకుండా ఫిబ్రవరి 12న జనం ముందుకు వెళుతుండటం సంతోషాన్ని కలిగిస్తోందని హీరో కార్తీక్ చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట ఆడియో వర్షన్ ను సీనియర్ జర్నలిస్టు నాగేంద్రకుమార్, ఫోటో జర్నలిస్ట్ సాయి రమేశ్ ఆవిష్కరించారు.  కార్యక్రమం ప్రారంభంలో సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.