ఈసారి ఆ సెంటిమెంట్ మారేనా!?

ఈసారి ఆ సెంటిమెంట్ మారేనా!?

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం'అన్నాత్తై' షూటింగ్ మొదలైంది. ఆగిపోయిందేమోనని అనుమానించిన వారందరికీ స్టార్ట్ కెమెరా, క్లాప్, యాక్షన్ అనే పదాలతో దర్శకుడు శివ సమాధానం చెప్పాడు. నయనతార, కీర్తి సురేశ్ నాయికలుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలోనే రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. అలానే అందులోని కొందరు సాంకేతిక నిపుణులు కరోనా బారిన పడ్డారు. దాంతో చాలా రోజుల పాటు విశ్రాంతిలోనే గడిపేసిన రజనీకాంత్ ఇప్పుడు తిరిగి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఆయన అభిమానులందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. ఇదే సమయంలో వాళ్ళు కాస్తంత ఆందోళనకూ లోనవుతున్నారు. ఎందుకంటే... ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు జనపతిబాబును ఎంపిక చేసినట్టు ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలిపింది.

గతంలో రజనీకాంత్ తో సన్ పిక్చర్స్ సంస్థ 'ఎంతిరన్, పేట్ట' చిత్రాలు నిర్మించింది. వారి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. అలానే రజనీకాంత్, జగపతిబాబు కూడా కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది. గతంలో రజనీకాంత్ 'కథానాయకుడు'లో జగపతి బాబు నటించాడు. ఓ స్టార్ హీరోకు, అతని బాల్య స్నేహితుడికి మధ్య సాగే కథ అది.  ఆ తర్వాత భారీ బడ్జెట్ మూవీ 'లింగ'లో జగపతిబాబు విలన్ గా నటించాడు. కానీ ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇప్పుడు మూడోసారి రజనీకాంత్ మూవీలో జగపతిబాబు ఏ పాత్ర చేస్తున్నాడో తెలియకపోయినా, అతను నడిస్తున్నాడు అనగానే అభిమానులు కాస్తంత కంగారు పడుతున్నారు. నిజానికి జగపతిబాబు ఇవాళ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఆ యా సినిమాలు  చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతనికి డిమాండ్ కూడా పెరిగింది. ఈ దృష్య్టానే సన్ పిక్చర్స్ సంస్థ 'అన్నాత్తై'లో కీలక పాత్రకు జగ్గూబాయ్ ను తీసుకుందని తెలుస్తోంది. ఏదేమైనా... ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఘన విజయం సాధించి, రజనీ-జగ్గూభాయ్ మీద ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ను తుడిచేస్తుందేమో చూడాలి.