'ఆహ్వానం అందలేదన్న బాధలో హరీష్‌రావు'

'ఆహ్వానం అందలేదన్న బాధలో హరీష్‌రావు'

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందకపోవడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు బాధపడుతున్నారని.. ఆ బాధలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. '30 ఏళ్లలో ఏ ప్రాజెక్టూ నిర్మించలేదని హరీష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన నీళ్లు తాగిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్‌ కాదా?' అని ప్రశ్నించారు.

కల్వకుర్తి, నెట్టంపాడు, ఎల్లంపల్లి, జూరాల, దేవాదుల ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్సేనని జగ్గారెడ్డి అన్నారు. 'కాంగ్రెస్ ఏ ప్రాజెక్ట్ కట్టిందో..నీకు తెలియకపోతే మీ మామని అడిగి తెలుసుకో..' అని హరీష్‌రావుకు ఆయన సూచించారు. కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.  ప్రాజెక్టులు ఎవరు కట్టినా సమర్ధించాలని.. కేసీఆర్‌ని కూడా అదే విధంగా సమర్థించామని జగ్గారెడ్డి అన్నారు.