హరీష్‌పై విరుచుకుపడ్డ జగ్గారెడ్డి

హరీష్‌పై విరుచుకుపడ్డ జగ్గారెడ్డి

టీఆర్ఎస్ నేత హరీష్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటాయింపులు లేకున్నా శ్రీరాంసాగర్‌కు నీటిని తరలించారని ఆరోపించారు. తాగునీటి కోసం ఉన్న మంజీర నీటిని ఎందుకు తరలించారు? డెడ్ స్టోరేజీ వాటర్ కూడా లేకుండా తరలించింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. హరీష్ చేసిన పాపానికి.. ప్రస్తుతం మంజీర ఎండిపోయిందన్నారు. నీటి తరలింపు విషయం కేసీఆర్‌కు తెలిస్తే ఒప్పుకునే వారు కాదని.. కేసీఆర్‌ కుటుంబసభ్యుడనే కారణంతో అధికారులు అడ్డు చెప్పలేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ దోపిడీలో దోషి హరీషేనని.. సీఎం కానేకాదని అన్నారు. అవి హరీష్‌ నీళ్లు కావని.. ఉమ్మడి మెదక్‌ ప్రజల నీళ్లని చెప్పారు.  తక్షణమే కేసీఆర్ జోక్యం చేసుకోవాలి న్యాయం చేయాలని కోరిన జగ్గారెడ్డి.. హరీష్ చేసిన పాపం మెదక్ జిల్లా ప్రజలకు, సీఎం కేసీఆర్‌కు శాపంగా మారిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్ కోరికకు కూడా హరీష్ తూట్లు పొడిచారని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీష్ పై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు. తానే గెలిస్తే ఇవన్నీ ప్రశ్నిస్తాననే.. తనను హరీష్‌ జైల్లో పెట్టించారాని ఆరోపించారు. చేసిన తప్పుకు హరీష్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. తక్షణ అవసరం మేరకు సంగారెడ్డి నీటి కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలని కోరారు.