ఆటోలో ఈవీఎం తరలింపుపై స్పందించిన కలెక్టర్

ఆటోలో ఈవీఎం తరలింపుపై స్పందించిన కలెక్టర్

జగిత్యాల జిల్లాలో రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. సోమవారం రాత్రి తహసీల్దారు కార్యాలయం నుంచి మినీ స్టేడియంలో ఉన్న గోదాంకు ఆటోలో 10 ఈవీఎంలను తరలించారు. గోదాంకు తాళం వేసి ఉండటంతో వాటిని తిరిగి కార్యాలయానికి తరలించారు. గత రెండు రోజుల క్రితం కూడా కారులో కొన్ని ఈవీఎంలను గోదాంకు తరలించారు. ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అయితే ఈ రెండు వివాదాలు జగిత్యాలలో చర్చనీయాంశమయ్యాయి. రెండు సంఘటనలపై జగిత్యాల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ స్పందించారు. రాత్రి తరలించిన ఈవీఎంలు జగిత్యాల మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు వాడినవని అన్నారు. పాత మోడల్ ఎం2 ఈవీఎంలని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు వాడిన ఈవీఎంకు వీటికి ఎలాంటి పొంతన లేదని తెలిపారు. ఆటోలో ఈవీఎంలు తరలించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.