జైషే చీఫ్ మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస

జైషే చీఫ్ మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస

దౌత్యపరంగా భారత్ కు ఘన విజయం లభించింది. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని భారత్ దశాబ్ద కాలంగా ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. భారత్ ప్రయత్నాలకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తమ మద్దతు తెలిపాయి. ఐరాసలో అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు జరిగిన ప్రతిసారీ భద్రతా మండలిలో శాశ్వతసభ్య దేశంగా ఉన్న చైనా మోకాలడ్డుతూ వచ్చింది. 

అయితే భారత్ నిరంతర దౌత్య ప్రయత్నాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇతర సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ల ఒత్తిడికి తలొగ్గి చైనా తన వైఖరిని మార్చుకోవడంతో ఐక్యరాజ్యసమితి మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. నిరంతర చర్చలు, దౌత్య యత్నాలతో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైందని అధికారులు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన దాడి నేపథ్యంలో ఓ ఉగ్రవాదిని ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో ఈ పరిణామాం ప్రధాని నరేంద్ర మోదీకి కలిసివస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.