మసూద్ అజహర్ సోదరుడిని అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్

మసూద్ అజహర్ సోదరుడిని అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తున్నట్టు ప్రపంచానికి చూపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం మరో సంచలన చర్య తీసుకుంది. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ ను అదుపులోకి తీసుకుంది. జైషే అధినేత మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్ అస్ఘర్ సహా నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్న 44 మందిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవూఫ్ అస్ఘర్ ప్రస్తుతం రక్షిత అదుపులో ఉన్నాడు.

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షహర్యార్ ఆఫ్రీదీ అస్ఘర్ ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు చేపడతామని అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీలో భాగంగా పాకిస్థాన్ ఈ చర్య చేపట్టింది. భారత్ పాకిస్థాన్ కు అందజేసిన పత్రాల్లో వారి పేర్లు ఉన్నాయి. వారిపై ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకపోతే వారిని విడుదల చేస్తామని పాకిస్థానీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి తెలిపారు.

ఇది భారత్ ఒత్తిడికి తలొగ్గి చేపట్టలేదని పాకిస్థానీ అధికారులు స్పష్టం చేశారు. కేవలం నేషనల్ యాక్షన్ ప్లాన్ కమిటీ నిర్ణయం మేరకు ఈ అరెస్టులు చేసినట్టు చెప్పారు.