ఆర్బీఐ రిజర్వుల తగ్గింపునకే జలాన్ ప్యానెల్ మొగ్గు

ఆర్బీఐ రిజర్వుల తగ్గింపునకే జలాన్ ప్యానెల్ మొగ్గు

మే 23న అధికారం చేపట్టబోయే కొత్త ప్రభుత్వానికి సంతోషకరమైన వార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మూలధన నిర్మాణ వ్యవస్థపై సమీక్ష జరుపుతున్న బిమల్ జలాన్ ప్యానెల్ ఆర్బీఐ రిజర్వుల తగ్గింపునకు సిఫార్సు చేసేలా ఉన్నట్టు కొన్ని వర్గాల ద్వారా తెలిసిందని ఈటీ నౌ తెలిపింది. కేంద్ర బ్యాంకు ఎంత మొత్తం రిజర్వులను ఉంచుకోవాలనే విషయం ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య వివాదాస్పద సమస్యగా ఉంది. దీని కారణంగానే గత ఏడాది డిసెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 

'వృద్ధి, ద్రవ్య విధి అంశాన్ని ప్యానెల్ సిఫార్సులు సమతౌల్యం చేయనున్నాయి. 1997 నాటి ఆసియా సంక్షోభం, 2008 నాటి లేమాన్ సంక్షోభ సమయాల్లో రిజర్వ్ లను వాడిన విధానం పరిశీలించనున్నట్టు' ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. జలాన్ ప్యానెల్ తన నివేదికను జూన్ కల్లా సమర్పించనుంది. 4-5 ఏళ్ల సమయానికి కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ లను బదలాయించాల్సిందిగా సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వృద్ధి తగ్గుతున్న సూచనలు, వినిమయం బలహీనంగా ఉండటం, ఈ ఎన్నికల సీజన్ లో రాజకీయ పార్టీలు విపరీతమైన వాగ్దానాలు చేస్తున్న సమయంలో  కేంద్ర బ్యాంక్ నుంచి అధికంగా నిధులు వస్తే ప్రభుత్వ ఖజానాకు సహాయకారిగా మారుతుంది.