జలియన్ వాలా బాగ్ బ్రిటిష్ చరిత్రలో అత్యంత సిగ్గు పడాల్సిన సంఘటన

జలియన్ వాలా బాగ్ బ్రిటిష్ చరిత్రలో అత్యంత సిగ్గు పడాల్సిన సంఘటన

అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ మూకుమ్మడి హత్యల సంఘటనకు 100 ఏళ్లయిన సందర్భంగా బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే ఇది బ్రిటిష్ భారతీయ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన అత్యంత అవమానకర సంఘటనగా అభివర్ణించారు. కానీ ఆమె ఈ కేసులో అధికారికంగా ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. కొన్ని సమావేశాలుగా హౌస్ ఆఫ్ కామన్స్ లో కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నట్టు  ప్రధానమంత్రి అధికారికంగా క్షమాపణలు చెప్పకుండానే ప్రశ్నోత్తరాల ఆరంభంలో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటనపై ఇంతకు ముందు కూడా విచారం వ్యక్తం చేసింది.

థెరెసా మే ఒక ప్రకటనలో '1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ సామూహిక వధల ఘటన బ్రిటిష్ భారతీయ చరిత్రపై సిగ్గుపడేలా చేసిన మాయని మచ్చ. బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ 1997లో జలియన్ వాలా బాగ్ వెళ్లే ముందు చెప్పినట్టుగా భారత్ తో మన గత చరిత్రకు ఇది దుఃఖించే ఉదాహరణ' అని తెలిపారు. జలియన్ వాలా బాగ్ సామూహిక హత్యాకాండ అమృత్ సర్ లో 1919 ఏప్రిల్ నెలలో వైశాఖి రోజున (ఏప్రిల్ 13, 1919) జరిగింది.

ఇంతకు ముందు జలియన్ వాలా బాగా సామూహిక వధలకు 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అధికారిక క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ పై మంగళవారం బ్రిటిష్ ప్రభుత్వం స్పందిస్తూ దీంతో తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలని సూచించింది. ఈ వారంలోనే జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగిన రోజు వస్తుంది.