ప్లీజ్ మీ టికెట్లు మాకివ్వండి..!

ప్లీజ్ మీ టికెట్లు మాకివ్వండి..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ స్పాట్‌లో నిలిచిన టీమిండియా సెమీస్‌లో బోల్తా కొట్టింది.. దీంతో ఫైనల్ మ్యాచ్‌ కోసం టికెట్ బుక్ చేసుకున్న టీమిండియా ఫ్యాన్స్.. ఆ మ్యాచ్‌కు వెళ్లడం కష్టమే.. అసలే వరుస విజయాలతో దూసుకుపోతోన్న కోహ్లీ సేన దూకుడు చూసి.. ఫైనల్‌ టికెట్లకు ముందే ఎగబడ్డారు ఫ్యాన్స్. 30 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న లార్డ్స్ స్టేడియంలో దాదాపు 80 శాతం టికెట్లను మనవాళ్లే బుక్ చేసుకున్నారట.. అయితే, సీన్ రివర్స్ అయిపోయింది. ఆదివారం రోజు ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ - న్యూజిలాండ్ టీమ్‌లు తలపడనున్నాయి. దీంతో ఇంగ్లాండ్‌, కివీస్‌ క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, నిరాశతో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌కి కివీస్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ ఓ విజ్ఞప్తి చేశారు. "ప్రియమైన భారత అభిమానుల్లారా.. మీకు ఫైనల్‌ మ్యాచ్‌కు రావాలని లేకపోతే దయచేసి మీ టికెట్లను తిరిగి ఐసీసీ వెబ్‌సైట్‌లోనే అమ్మండి.. ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లకు బయట మంచి డిమాండ్‌ ఉంటుందని నాకు తెలుసు. కానీ, నిజమైన క్రికెట్‌ అభిమానులు కూడా మ్యాచ్ చూడటానికి ఒక అవకాశం ఇవ్వండి'' అంటూ సోషల్ మీడియాలో అభ్యర్థించాడు జేమ్స్ నీషమ్. ఇక, సెమీస్ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్‌ కెప్టెన్ విలియమ్సన్‌ కూడా టీమిండియా ఫ్యాన్స్ కివీస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన సంగతి తెలసిందే. 

మరోవైపు ఫైనల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టింది ఐసీసీ... ఇప్పటికే టికెట్లు బుక్ కావడంతో రిటర్న్‌ పాలసీని తమ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లు ఇక్కడ తిరిగి విక్రయించే అవకాశం ఉంటుంది. టికెట్ రిటర్న్ చేస్తే 100 శాతం టికెట్ ధరని తిరిగి చెల్లిస్తోంది ఐసీసీ. మరి ఎన్ని టికెట్లు రిటర్న్ వెళ్తాయి.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ అభిమానులకు ఎంత వరకు టికెట్లు అందుతాయో చూడాలి మరి.