ఒక రాష్ట్రం తగ్గింది.. 2 కేంద్ర పాలితప్రాంతాలు పెరిగాయి..

ఒక రాష్ట్రం తగ్గింది.. 2 కేంద్ర పాలితప్రాంతాలు పెరిగాయి..

భారత్‌లో ఒక రాష్ట్రం తగ్గింది.. రెండు కేంద్ర పాలితప్రాంతాలు పెరిగాయి.. అందేంటి రాష్ట్రాల సంఖ్య పెరుగుతుంది.. కానీ, తగ్గడమేంటి? అనే ఆశ్చర్యపోతున్నారా? ఇప్పటివరకు రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోవడమే దీనికి కారణం. జమ్ముకశ్మీర్‌ రాష్ర్టాన్ని విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆగస్టు 9వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులు అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ఆ రాష్ట్రం జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ పేరిట రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. దీంతో దేశంలో రాష్ర్టాల సంఖ్య 28కి తగ్గగా, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఏడుకు పెరిగింది. 

ఇక, ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పాలన పగ్గాలు చేపట్టనున్నారు లెఫ్టినెంట్‌ గవర్నర్లు.. జమ్ముకశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గుజరాత్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి జీసీ ముర్ము బాధ్యతలు చేపట్టనున్నారు. అదే సమయంలో మరో ఐఏఎస్‌ అధికారి రాధాకృష్ణ మాథుర్‌ లఢక్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతారు. లడఖ్‌కు శాసనసభ ఉండదు. ఆ ప్రాంతంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్ర హోంశాఖ ప్రత్యక్షంగా పరిపాలన సాగిస్తుంది. జమ్ముకశ్మీర్‌కు శాసనసభ ఉంటుంది. కానీ, ఢిల్లీ తరహాలో ఇక్కడ పాలన సాగుతుంది. అయితే ఇక్కడ పాలనా విధానాలను నిర్దేశించే జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ఇంకా నోటిఫై కాలేదు. జాతీయ ఐక్యతా దినోత్సవం రోజునే రెండుకొత్త కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భవించడం విశేషం.