తెలుగు రాష్ట్రాల్లో జనసేన, బీఎస్పీల పొత్తు

తెలుగు రాష్ట్రాల్లో జనసేన, బీఎస్పీల పొత్తు

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఏడు దశల్లో జరిగే ఎన్నికల ప్రకటన వెలువడగానే పార్టీల్లో పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దక్షిణాది సూపర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఇవాళ పవన్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఎస్పీ-జనసేనల మధ్య పొత్తు కుదిరినట్టు మాయావతి శుక్రవారం లక్నోలో ప్రకటించారు.

'ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి బీఎస్పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పోటీ చేయనుంది' అని మాయావతి తెలిపారు. త్వరలోనే సీట్ల పంపకాలు ఖరారు చేస్తామని, రెండు ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఎలాంటి వివాదం లేదని చెప్పారు. 

'పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఎలాంటి వివాదం లేదని' మాయావతి అన్నారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటానని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో సంబంధాలు లేని ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొనేందుకు బీఎస్పీ ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్టు పవన్ ప్రకటించారు. బెహన్జీ మాయావతిని దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు పవన్ తెలిపారు. బీఎస్పీతో పొత్తు తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ-మేం బెహన్జీని మన దేశ ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం. ఇది మా హృదయపూర్వకమైన కోరిక' అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఏప్రిల్ 11న జరుగుతాయి.