టీఆర్ఎస్ ను సింగిల్ డిజిట్ కే పరిమితం చేశారు

టీఆర్ఎస్ ను సింగిల్ డిజిట్ కే పరిమితం చేశారు

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు అనూహ్య తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 16 సీట్లు గెలుస్తామని చెప్పిన టీఆర్ఎస్ ను సింగిల్ డిజిట్ కే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఈ ఎన్నికలను గుణపాఠంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని అన్నారు. పూర్తి మెజార్టీ వచ్చాక ఇంకా ఫిరాయింపులు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో అఖండ విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. సీఎం కాబోతున్న జగన్ కు శుభాకాంక్షలు అని జానా రెడ్డి అన్నారు.

'నాకు ఒకరు టికెట్ ఇప్పించే పరిస్థితి ఉందా..? టికెట్ కోసం ప్రయత్నం చేసినా దాఖలాలు లేవు. సోనియా గాంధీ పిలిచి పోటీ చేయమంటే కూడా సైలెంట్ గా ఉన్నా. నేను పోటీ చేయాలని అనుకుంటే ఎంపీగా పోటీ చేసే వాన్ని కదా. నేను ఎంపీగా పోటీ చేయాలనుకుంటే... ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనక్కి తగ్గేవారు. 2024 లో పోటీ చేస్తానో లేదో ఆలోచించాలి. విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తోంది. 2024 లో పరిస్థితిని బట్టి నిర్ణయం. నా కొడుకును నేను తీసుకురావడం ఏంటీ.. ప్రజలుగుర్తించాలి. అఖిలేష్.. మాయావతి పొత్తు హర్షించారు. కానీ కాంగ్రెస్ తో కలిసి ఉంటే బాగుండేది. మోడీని ఓడించాలని జట్టు కట్టిన కూటమి కాంగ్రెస్ ముందు ఉండాల్సింది. ఇంతగా పనిచేసినా అధికారంలోకి రాలేకపోయామని బాధతో ఉన్నారు. రాజీనామా పై రాహుల్ పునరాలోచన చేసుకోవాలి' అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.