జనసేన పోటీనుంచి తప్పుకోవడం వెనక వ్యూహం ఏంటి?

జనసేన పోటీనుంచి తప్పుకోవడం వెనక వ్యూహం ఏంటి?

ఏపీలో పొత్తు.. తెలంగాణలో మద్దతు. ఇదీ బీజేపీ, జనసేన పార్టీల తీరు. నాటకీయ పరిణామాల మధ్య ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడినా.. ఈ రెండు పార్టీల మధ్య అసలేం జరుగుతుందన్న చర్చ మాత్రం ఆగడం లేదు. జనసేనపై బీజేపీలో రెండు వాదనలు ఉన్నాయనే కొత్త వాదన తెరపైకి వస్తోంది. 

జనసైనికుల ఉత్సాహంపై నీళ్లు జల్లేశారా?

బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటే.. కలిసి పోటీ చేయాలి కదా? ఎందుకు వెనక్కి తగ్గారు? మిత్రపక్షానికి మద్దతిచ్చి GHMCలో అస్త్రసన్యాసం చేయడం వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా? ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ ఓ రేంజ్‌లో సాగుతోంది.  బీజేపీ నేతలు పవన్‌ కల్యాణ్‌కు ఏం చెప్పారు? జనసైనికులు పోటీ చేద్దామని ఉవ్విళ్లూరుతుంటే.. వారి ఉత్సాహంపై పవన్‌ ఎందుకు నీళ్లు జల్లారు? జనసేనాని నిర్ణయంపై జనసైనికుల స్పందనేంటి? ఇలా అనేక ప్రశ్నలపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసైనికులు అనేక అంచనాలు పెట్టుకున్నారా? 

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధికారికంగా ప్రకటించిన వెంటనే రెండు రాష్ట్రాల్లోని జనసైనికులు.. పవన్‌ను అభిమానించేవారు ఎగిరి గెంతేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో చేదు అనుభవం మిగల్చడంతో.. GHMCలో బలమున్న చోట సత్తాచాటి మళ్లీ పుంజుకోవాలని భావించారు కార్యకర్తలు. ఏపీ, తెలంగాణకు హైదరాబాద్‌ కీలకం కావడంతో... సిటీలో ఏమాత్రం సానుకూల ఫలితం వచ్చినా.. అది వచ్చే ఎన్నికలకు బలమైన టానిక్‌గా పనిచేస్తుందని లెక్కలు వేసుకున్నారు జనసైనికులు.   అభ్యర్థుల వేటలో పడ్డారు. పొత్తుపై అటు జనసేన కానీ.. ఇటు బీజేపీ కానీ ఎలాంటి ఆలోచన చేయలేదు. కమలనాథలు సైతం జనసేన పోటీకి ఆసక్తితో ఉందో లేదో కూడా అని పవన్‌ను అసలు పట్టించుకోలేదు. జనసేనాని ప్రచారానికి వస్తే సరిపోతుందనే భావనలో ఉండిపోయారట. చివరకు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్నట్టుగా మలుపులు తీసుకున్నాయి పరిణామాలు. 

జనసేనాని నిర్ణయం పార్టీ కార్యకర్తలను నిరాశపరిచిందట!

దాదాపు 40-50 స్థానాల్లో పోటీకి జనసేన సిద్ధమని వార్తలొచ్చాయి. 18 చోట్ల పోటీకి అభ్యర్థులను సిద్ధం చేశారని లీకులు హల్‌చల్‌ చేశాయి. మధ్యలో బీజేపీతో పొత్తు చర్చలపై ప్రచారం సాగింది. కానీ.. అలాంటిదేమీ లేదని బండి సంజయ్‌ చెప్పడంతో జనసేన ఒంటిరిగానే బరిలో దిగుతుందేమోనని అంతా అనుకున్నారు. ఇంతలో  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ OBC సెల్‌ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. లోపల చర్చలు జరుగుతుంటే.. బయట పొత్తుపై ఊహాగానాలు షికారు చేశాయి. కానీ.. GHMC ఎన్నికల బరి నుంచి తప్పుకొని.. బీజేపీకి భేషరతుగా మద్దతిస్తున్నట్టు పవన్‌ చేసిన ప్రకటన జనసైనికులను నిరాశపరిచిందట.

బీజేపీలోని ఓ వర్గం పవన్‌తో పొత్తును వ్యతిరేకించిందా? 

ఏపీలో పవన్‌ కల్యాణ్‌తో పొత్తుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీ నాయకులు.. తెలంగాణకు వచ్చేసరికి ఎందుకిలా చేశారు అన్న చర్చ మొదలైంది. తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం పవన్‌ కల్యాణ్‌తో పొత్తు కోరుకుంటుందోని.. మరో వర్గం వద్దంటోందని సమాచారం.  బీజేపీ పాతతరం నాయకులు జనసేనానికి ప్రాధాన్యం ఇస్తే.. కొత్త తరం నాయకులు ఆయన్ని లైట్‌ తీసుకుంటున్నారట. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ఇంట్లో పవన్‌ కల్యాణ్‌తో జరిగిన చర్చలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. పవన్‌తో మాట్లాడేందుకు ఎవరోచ్చారో.. ఎవరు రాలేదో చూస్తే విషయం స్పష్టమైపోతోందని జనసైనికులే కామెంట్స్‌ చేస్తున్నారట. 

రెండు పార్టీలలోనూ లోతైన చర్చ జరుగుతోందా? 

జనసేనతో పొత్తుపై బీజేపీలోనే రెండు రకాల వాదన ఉందన్నది కమలనాథులు కూడా ఒప్పుకొనే మాట. పవన్‌ కల్యాణతో కలిసి వెళ్దామని కొందరు చెబుతుంటే.. మరికొందరు  అక్కర్లేదని ముఖం పక్కకు తిప్పేసుకుంటున్నారట. పాత.. కొత్త తరం నాయకుల భిన్న ఆలోచనల ఫలితమే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో జనసేన, బీజేపీ మధ్య గందరగోళానికి దారితీసిందని చెబుతున్నారు. ఇప్పటికైతే జరిగిన పరిణామాలపై రెండు పార్టీలలోనూ అంతర్గతంగా లోతైన చర్చే జరుగుతోందట. మరి.. ఈ అనుమానాలకు, అపోహలకు రెండుపార్టీలు ఎలా చెక్‌ పెడతాయో చూడాలి.