అక్కడ ఆస్తులు, అవకాశాలు.. ఇక్కడ అప్పులు, నిరుద్యోగం

అక్కడ ఆస్తులు, అవకాశాలు.. ఇక్కడ అప్పులు, నిరుద్యోగం

రాష్ట్ర విభజన క్రమంలో ఆస్తులు, అవకాశాలు తెలంగాణకు ఇచ్చి.. ఆంధ్రాకు అప్పులు, నిరుద్యోగమిచ్చారని ఆరోపించారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎంతో అన్యాయంగా తెలుగు ప్రజల విభజన జరిగిందని ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు పవన్ పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెరుకున్నారు. అక్కడ మూడు రోడ్ల జుంక్షన్ వద్ద భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 'వైసీపీ అవినీతికి పాల్పడుతుందని.. విపరీతంగా భూకబ్జాలు చేస్తదని గత ఎన్నికల్లో ఆపార్టీకి మద్దతు ఇవ్వకుండా టీడీపీకి మద్దతు పలికాను. ఇప్పుడు వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ నేతలు భూకబ్జాలు, ఇసుక మాఫియా చేస్తున్నారు. చీపురుపుల్లిలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వేస్తున్నారు. ఇది సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. ఉచిత ఇసుక పేరుతో అవినీతికి చట్టబద్ధత కల్పించారు. ఇదా మీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరుతో ఇసుక దోచుకుంటున్నారు. ఇది అవినీతి కాదా? ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారు. లోకేష్ కు మంత్రి ఉద్యోగం ఇచ్చారు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగం కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు తన తనయుడుకు మంత్రి ఉద్యోగం ఇచ్చారు' అని పవన్ కల్యాణ్ చంద్రబాబుపై మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... 'ఉత్తరాంధ్ర ప్రజలను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అని నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. నేను రెచ్చగొట్టడం లేదు. రెచ్చగొట్టే వాడిని కాదు. రెచ్చగొట్టే వాడిని అయితే మీకెందుకు మద్దతు ఇస్తాను' అని పేర్కొన్నారు. అలాగే 'విజన్ 2020 అన్నారు... ఓడిపోయారు. ఇప్పుడు విజన్ 2050 అంటూ.. మళ్లీ అధికారం పొందాలనుకుంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. గత ఎన్నికల్లో 75 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నా కానీ అనుభవం కలిగిన వ్యక్తులుగా చంద్రబాబు నాయుడుకు, నరేంద్రమోడీకి మద్దతు పలికా. ఇప్పటికయినా టీడీపీ నేతలు ఇసుకమాఫియాను అరికట్టాలి. లేకపోతే 2050 కు నదులు మిగలవు' అని అధికార పార్టీపై పవన్ కల్యాణ్ విరుచుకు పడ్డారు.